logo

వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..

గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది.

Published : 03 Jul 2024 04:20 IST

అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ భవనంపై అయిదేళ్ల నిర్లక్ష్యం
న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

భవనం చుట్టూ పిచ్చి మొక్కలు, పాదులు

గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణానికి సమీపంలోని జనుపల్లెలో వైకాపా కార్యాలయానికి స్థలం కేటాయించుకున్నారు తప్ప.. ఇదే గ్రామానికి దగ్గర్లోని నల్లమిల్లిలో ఉన్న అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మాత్రం యత్నించలేదు. దీంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన స్టడీ సర్కిల్‌ భవనం పాడైపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తారనే ఆశలు యువతలో నెలకొన్నాయి.

2018లో ప్రారంభించినా..!

అమలాపురం మండలం నల్లమిల్లిలో తెదేపా ప్రభుత్వం 2018లో రూ.కోటితో నిర్మించిన స్టడీ సర్కిల్‌ భవనాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నాటి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొన్ని సౌకర్యాలు కల్పించాలనే కారణాలతో స్టడీ సర్కిల్‌ భవనం అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చినా భవనం గురించి కనీసం పట్టించుకోలేదు. దీంతో దానిచుట్టూ మొక్కలు పెరిగిపోవడంతోపాటు భవనంలోకి ప్రవేశించేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపు పగిలిపోయి కనిపిస్తోంది.

యువతకు ఊతమియ్యాలి..

జిల్లాలోని ఇతర ప్రాంతాల వారితోపాటు అమలాపురం గ్రామీణం, పట్టణం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల పరిధిలోని సుమారు 50 వేలమంది యువతకు ఇక్కడి అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ ఉపయోగపడుతుందని గత తెదేపా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లుచల్లింది. దీంతో స్టడీ సర్కిల్‌ ద్వారా యువతకు నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు అందకుండానే మూలకుచేరింది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఆనందరావు ఎన్నిక కావడంతో ప్రత్యేకంగా దృష్టిసారించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు తెలిపాం..

నల్లమిల్లిలోని అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి నుంచి ఆదేశాలొస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో స్టడీ సర్కిల్‌ ఉంది. దానిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

జ్యోతిలక్ష్మీదేవి, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని