logo

వీడని కోత.. తప్పని వెత..!

కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్‌ హార్బర్‌ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది.

Published : 03 Jul 2024 04:18 IST

యు.కొత్తపల్లిలో కీలక సమస్యలు
నేడు ఉపముఖ్యమంత్రి రాకతో మత్స్యకారుల్లో ఆశలు
న్యూస్‌టుడే, కొత్తపల్లి

ఉప్పాడలో తీర ప్రాంతం ఇలా...

కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్‌ హార్బర్‌ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి, ఉప ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు స్వీకరించగా.. ఆ హోదాలో తొలిసారి తీరప్రాంత గ్రామాలకు వస్తుండటంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని మత్స్యకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సమస్యకు పరిష్కారం దక్కేనా?

మండలంలో సుబ్బంపేట నుంచి అమినాబాదు వరకు ఉన్న ఆరు గ్రామాలు కెరటాల కోతతో అల్లాడుతున్నాయి. వందలాది గృహాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. వీటి పరిధిలోని 16 వేల మంది జీవనం ప్రశ్నార్థకమవుతోంది. 16 ఏళ్ల క్రితం ఈ సమస్య మొదలవగా, అప్పటికే సుమారు 300 గృహాలు సముద్రపు నీట మునిగాయి. రక్షణ కోసం 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.12 కోట్ల నిధులతో ఆరు గ్రామాలకు జియోట్యూబ్‌ ఏర్పాటు చేయగా.. అయిదేళ్ల పాటు సత్ఫలితాలనిచ్చింది. అనంతరం ట్యూబ్‌ ధ్వంసమవడం, మరమ్మతుల్లేకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గడిచిన మూడేళ్లల్లో సుమారు 200 గృహాలు కోతతో నేలకూలాయి. మరో 50 గృహాలు నేలకూలడానికి సిద్ధంగా ఉన్నాయి. నిపుణుల పరిశీలన, రక్షణ నిర్మాణాలు చేపడితేనే ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

మధ్య దశలోనే నిలిచిపోయిన హార్బర్‌ నిర్మాణం

హార్బర్‌ సాకారం ఎప్పుడు

ఉప్పాడ చేపలరేవులో హార్బర్‌ నిర్మాణం మత్స్యకారుల కల. ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నా అది అసంపూర్తి పనుల్లోనే దర్శనమిస్తోంది. గతంలో తెదేపా ప్రభుత్వంలో హార్బర్‌ మంజూరు కాగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.422 కోట్ల నిధులతో 2020 డిసెంబర్‌లో అప్పటి సీఎం జగన్‌ చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని చెప్పి, పనులు ప్రారంభించిన మూడు నెలలకే నిలిపేశారు. ఏడాది తరవాత మరోసారి పనులు మొదలై సుమారు రూ.180 కోట్ల మేర జరిగినా.. బిల్లుల మంజూరులో జాప్యంతో మరోమారు ఆగిపోయాయి. రూ.60 కోట్ల బిల్లు మంజూరైనా పనుల్లో వేగం కరవైంది. ఈ నాలుగేళ్లలో కేవలం 50 శాతం కూడా పూర్తికాలేదు. సముద్రంలోకి రాళ్లగట్టు వేయగా, భవనాల నిర్మాణం మధ్యలోనే ఆగింది. రోడ్లు, మౌలిక వసతుల కల్పన జరగాల్సి ఉంది. ఇదిలాఉంటే, ఉప్పాడ తీరంలో వరుస బోటు ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఏడాది కాలంలో ఎనిమిది జరగ్గా.. అవగాహన లేకుండా సముద్రంలోకి వేసిన రాళ్లగట్టు కారణమన్నది మత్స్యకారుల మాట. మొత్తంగా ఈ రెండు సమస్యలు ఇబ్బంది పెడుతుండగా.. పవన్‌కల్యాణ్‌ పర్యటనతో పరిష్కారంపై ఆశలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని