logo

నాణ్యతకు తిలోదకాలు

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్‌టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు.

Published : 03 Jul 2024 04:16 IST

నాసిరకం సిమెంట్‌ ఇటుకలతోనే గోడ నిర్మాణం

గాంధీనగర్, న్యూస్‌టుడే: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్‌టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. జేఎన్‌టీయూకేలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రీన్‌కో సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో జేఎన్‌టీయూకేలో గార్డెనింగ్‌ సుందరీకరణకు ముందుకు వచ్చింది. ఇందుకోసం వైకాపా అధికారంలో ఉండగా జేఎన్‌టీయూకేతో సైతం ఒప్పందం చేసుకుంది. సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.కోటికి పైగా  కేటాయించారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల అనంతరం ఇటీవల సంస్థకు చెందిన ప్రతినిధులు పనులు ప్రారంభించారు. గార్డెనింగ్‌ లాన్‌ గోడను ఎత్తు చేసేందుకు నాసిరకం సిమెంట్‌ ఇటుకలను ఉపయోగిస్తున్నారు. ఈ ఇటుకలు పట్టుకుంటే బూడిదగా రాలిపోతూ నిర్మాణానికి వాడక ముందే పగిలిపోతున్నాయి. వాటినే గార్డెనింగ్‌ లాన్‌ గోడను ఎత్తు చేయడానికి ఉపయోగించడం విశేషం. ఒకవైపు గోడను పూర్తి చేసి, మరోవైపు లాన్‌ గోడ పనులు మొదలు ప్రారంభించారు. నాసిరకం ఇటుకలతో నిర్మాణ పనులు చేపడితే మూన్నాళ్ల ముచ్చటగా ఉండటంతోపాటు, గట్టిగా గాలేస్తే పడిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని జేఎన్‌టీయూకే ఏఈ సన్నీ దృష్టికి తీసుకువెళ్లగా ఆ పనులు తమ పరిధిలోనివి కాదని.. సీఎస్‌ఆర్‌ నిధులతో గ్రీన్‌కో సంస్థ చేస్తోందని పేర్కొన్నారు. జేఎన్‌టీయూకేలో జరిగే నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు చూడాల్సిన అధికారులు తమకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం గమనార్హం.

నిర్మాణం చేయక ముందే ఇలా..

ప్రధాన భవనం వద్ద గార్డెనింగ్‌ లాన్‌ గోడను ఎత్తు చేసేందుకు ఉపయోగిస్తున్న నాసిరకం సిమెంట్‌ ఇటుకలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని