logo

ఊరూరా పండగలా ఎన్టీఆర్‌ భరోసా లబ్ధి పంపిణీ

జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు.. ప్రతి పింఛను లబ్ధిదారు ఇంటి వాకిళ్లు సూర్యుడు ఉదయించకముందే తెరుచుకున్నాయి

Updated : 02 Jul 2024 06:16 IST

వాలంటీర్లు లేకున్నా రాత్రి 10 గంటలకే 95.24 శాతం పూర్తి

ఈనాడు, రాజమహేంద్రవరం: జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు.. ప్రతి పింఛను లబ్ధిదారు ఇంటి వాకిళ్లు సూర్యుడు ఉదయించకముందే తెరుచుకున్నాయి. ఎన్టీఆర్‌ భరోసా పింఛను రూ.7 వేల చొప్పున అందించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. వృద్ధులు, దివ్యాంగులు వితంతువులు.. ఒంటరి మహిళలు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలా అందరికీ మేలు చేసేలా కూటమి ప్రభుత్వం అందించిన కానుకతో పల్లెలు, పట్టణాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ హర్షాన్ని వ్యక్తంచేశారు. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు.. తెదేపా, జనసేన, భాజపా నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛను అందించే ప్రక్రియ ఆరంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారు.. గొల్లప్రోలులో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్, రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పాల్గొని పింఛన్లు అందించారు.నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. 

కె.గంగవరం మండలం దంగేరులో పింఛను అందజేసేందుకు డోలు సన్నాయి మేళాలతో వెళ్తున్న ప్రజాప్రతినిధులు 

ఊరూరా పండగే.. 

మండపేట, జగ్గంపేట, కొత్తపేట, పి.గన్నవరం, గోపాలపురం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం, అనపర్తి, పెద్దాపురం, ప్రత్తిపాడు, అమలాపురం, రాజోలు ఇతర నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతల చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తాళ్లరేవులో పలుచోట్ల లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్‌ రాగంపేటలో రూ.7వేల పింఛను సొమ్ముతోపాటు కిలో చొప్పున మిఠాయి ప్యాకెట్లు అందించారు. 

గండేపల్లి: జడ్‌.రాగంపేటలో పింఛను సొమ్ము రూ. ఏడు వేలతో పాటు కిలో స్వీటు బాక్స్‌ను అందజేస్తున్న తెదేపా నాయకులు

రికార్డు స్థాయిలో అందజేత

గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లతో అయిదురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయిస్తే మొదటి రోజు 85 నుంచి 90 శాతంలోపే జరిగేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ప్రమేయం లేకుండా ప్రక్రియ చేపట్టింది. సోమవారం రాత్రి 10 గంటల కల్లా ఉమ్మడి జిల్లాలో 95.24 శాతం పంపిణీ పూర్తిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు మినహా అందరికీ తొలి రోజే అందించేలా తూర్పు, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు ప్రశాంతి, షాన్‌ మోహన్, హిమాన్షుశుక్లా కార్యాచరణ సిద్ధం చేశారు. కొన్ని చోట్ల సర్వర్‌ మొరాయించడంతో సుమారు గంటపాటు నిలిచింది. తరువాత సజావుగా సాగింది.  కాకినాడ నగరంలో రాత్రి 7.50 గంటల వరకు 96.29 శాతం పింఛన్లు అందించి జిల్లాలో ప్రథమంగా నిలిచారు. 

ఆత్మాభిమానంతో గడిపేలా

ప్రత్తిపాడు: సంపాదించలేని స్థితిలో ఆత్మాభిమానంతో బతికేలా పింఛను ధైర్యాన్నిస్తోంది. ఈ వయసులోనూ ఇంత కన్నా ప్రభుత్వం నుంచి ఏం మంచి కోరుకుంటాం. రూ.7వేలు పింఛనుగా అందుకోవడం, ప్రతి నెలా రూ.4వేలు చేతికి రావడం శేషజీవితాన్ని ఆనందంగా గడపడానికి సరిపోతుంది. 

పిఠాపురం: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చక్రి అనే బాలుడిని చూపిస్తూ.. ఇలాంటి రెండు తరాలకు అండగా ఉంటామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్,

ఇన్నాళ్లకు గౌరవం దక్కింది

వైకాపా తరఫున సర్పంచిగా గెలిచినా ఏనాడూ తగిన గౌరవం దక్కలేదు. ఏ పని ఉన్నా వాలంటీర్ల ద్వారా చేయడంతో మాకు గుర్తింపు లభించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పింఛన్ల పంపిణీ సర్పంచి చేతుల మీదుగా చేపట్టడం సంతోషంగా ఉంది.

 - గవర భవానీ, కొత్తపల్లి సర్పంచి 


కుమార్తెను మళ్లీ పాఠశాలకు పంపిస్తా..  

మసీదుసెంటర్‌: నా భర్త కూలి పనులు చేసుకుంటా కుటుంబాన్ని పోషించేవారు. ఆయన మృతి చెందడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఏడాది కాలంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేక కుమార్తెను చదువు మాన్పించేశా. ఈ నెల రూ.7వేలు పింఛను ఇవ్వడం ఆనందంగా ఉంది. బిడ్డ చదువు నిమిత్తం ఖర్చు పెడతా. మళ్లీ పాఠశాలకు పంపిస్తా.

-కె.భవాని, వలందపేట, జగన్నాథపురం(కాకినాడ)


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు