logo

గుత్తేదారుల నిర్వాకం.. పేదలకు సరకులు దూరం

జిల్లాలో రేషన్‌ సరకుల పంపిణీ సోమవారం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,060 చౌక దుకాణాల పరిధిలో 420 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేపట్టారు.

Published : 02 Jul 2024 05:29 IST

 పంచదార, కందిపప్పు ప్యాకెట్ల తూకంలో తేడాతో వెనక్కి పంపిన వైనం 
వచ్చే నెల కేజీ పంచదార అందజేత

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో రేషన్‌ సరకుల పంపిణీ సోమవారం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,060 చౌక దుకాణాల పరిధిలో 420 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేపట్టారు. ఈ నెల కేవలం బియ్యం మాత్రమే కార్డుదారులకు అందిస్తున్నారు. జిల్లాలో 6.54 లక్షల కార్డులకు ఎండీయూ వాహనాల వద్ద బియ్యం అందజేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహన్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఉన్న రేషన్‌ సరకులు తనిఖీ చేశారు. గుత్తేదారులు సరఫరా చేసిన పంచదార, కందిపప్పు, ఇతర సరకులు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ సరకును వెనక్కి పంపారు. కచ్చితమైన తూకంతో సరకులు ఇస్తేనే తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో జులై నెలకు పంచదార ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరఫరా కాలేదు. దీంతో ఈ నెల బియ్యం మాత్రమే కార్డుదారులకు అందిస్తున్నారు. ప్రతినెలా అరకేజీ పంచదార పంపిణీ చేస్తుండగా, వచ్చేనెలలో జులై సరకుతో కలిసి కేజీ పంచదార పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇంకా కందిపప్పు, వంటనూనె వంటి సరకులు రాయితీపై కార్డుదారులకు అందించాలని భావిస్తున్నారు. ఈ నెలకు ఎండీయూ వాహనాలను వినియోగించారు. వచ్చేనెల నుంచి చౌక దుకాణాల వద్దే సరకులు పంపిణీ జరుగుతుందని ఈ శాఖ అధికారులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని