logo

కళ్ల నిండా కని‘పింఛెను’ సంతోషం

జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషఈనాడు, రాజమహేంద్రవరంలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు

Updated : 02 Jul 2024 06:19 IST

ఊరూరా పండగలా ఎన్టీఆర్‌ భరోసా లబ్ధి పంపిణీ
వాలంటీర్లు లేకున్నా రాత్రి 10 గంటలకే 95.24 శాతం పూర్తి

జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషఈనాడు, రాజమహేంద్రవరంలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు.. ప్రతి పింఛను లబ్ధిదారు ఇంటి వాకిళ్లు సూర్యుడు ఉదయించకముందే తెరుచుకున్నాయి. ఎన్టీఆర్‌ భరోసా పింఛను రూ.7 వేల చొప్పున అందించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు.. ఒంటరి మహిళలు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలా అందరికీ మేలు చేసేలా కూటమి ప్రభుత్వం అందించిన కానుకతో పల్లెలు, పట్టణాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ హర్షాన్ని వ్యక్తంచేశారు. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు.. తెదేపా, జనసేన, భాజపా నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛను అందించే ప్రక్రియ ఆరంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారు.. గొల్లప్రోలులో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్, రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పాల్గొని పింఛన్లు అందించారు.నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. 

పిల్లలకు కొత్త బట్టలు కొంటాను

సీతానగరం: పోలియోతో రెండుకాళ్లు చచ్చుబడిపోయిన సీతానగరానికి చెందిన దాస్యం పోశయ్యకు పింఛనే ఆధారం. భార్య, ఇద్దరు పిల్లలతో గుడిసెలో ఉంటున్నాడు. పెంచిన పింఛను రూ.6వేలు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ చాలీచాలని మందులు కొనుక్కుంటూ పిల్లలకు కనీసం జతబట్టలు కూడా తీసుకోలేని స్థితిలో ఈ డబ్బుతో వాటిని నెరవేర్చుకుంటామని పోశయ్య చెప్పారు.

టి.నగర్‌: పింఛన్ల పెంపుతో జిల్లా డెఫ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చిత్రాలకు పుష్కర ఘాట్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు.

ఊరూరా పండగే.. 

మండపేట, జగ్గంపేట, కొత్తపేట, పి.గన్నవరం, గోపాలపురం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం, అనపర్తి, పెద్దాపురం, ప్రత్తిపాడు, అమలాపురం, రాజోలు ఇతర నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతల చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తాళ్లరేవులో పలుచోట్ల లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్‌ రాగంపేటలో రూ.7వేల పింఛను సొమ్ముతోపాటు కిలో చొప్పున మిఠాయి ప్యాకెట్లు అందించారు. 

రికార్డు స్థాయిలో అందజేత

గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లతో అయిదురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయిస్తే మొదటి రోజు 85 నుంచి 90 శాతంలోపే జరిగేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ప్రమేయం లేకుండా ప్రక్రియ చేపట్టింది. సోమవారం రాత్రి 10 గంటల కల్లా ఉమ్మడి జిల్లాలో 95.24 శాతం పంపిణీ పూర్తిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు మినహా అందరికీ తొలి రోజే అందించేలా తూర్పు, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు ప్రశాంతి, షాన్‌ మోహన్, హిమాన్షుశుక్లా కార్యాచరణ సిద్ధం చేశారు. కొన్ని చోట్ల సర్వర్‌ మొరాయించడంతో సుమారు గంటపాటు నిలిచింది. తరువాత సజావుగా సాగింది. కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీకి 3,897 మంది సచివాలయాల సిబ్బంది, ఇతర శాఖల వారు 350 మందిని నియమించారు. 

గోపవరంలో పింఛన్‌ అందిస్తున్న మంత్రి దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే శేషారావు  

బాబు మాట.. బంగారు మూట

కడియం: చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామ పరిధిలోని చైతన్యనగర్‌ లెప్రసీనగర్‌ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రూ.7 వేల పింఛను అందుకున్న వెంటనే  చంద్రబాబు చిత్రపటాన్ని ముద్దాడుతున్న వృద్ధురాలు.

రూ.7 వేలు చేతిలో పెట్టేసరికి కన్నీళ్లొచ్చాయి   

వి.ఎల్‌.పురం: నా పేరు గజరపు లక్ష్మి. నా భర్త చనిపోయి 25 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నాకు 65 ఏళ్లు. సొంత ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం ఒక ఇంట్లో పనిచేస్తున్నా. ఆసరాగా ఉండే కుమారుడు లివర్‌ సంబంధ వ్యాధి బారినపడ్డాడు. నెలకు రూ.3 వేల వరకు మందుల ఖర్చవుతుంది. నాకొచ్చే డబ్బులు సరిపోక అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు పింఛను డబ్బులు రూ.7 వేలు ఇచ్చేసరికి ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వస్తాయని చెప్పడంతో చాలా సంతోషపడ్డా.

మాకు మరింత భరోసా..

వృద్ధాప్యం బారిన పడిన మాలాంటి వారికి కూటమి ప్రభుత్వం మరింత భరోసాగా మారనుంది. అద్దె ఇంట్లో ఉంటున్న నాకు ఈనెల రూ.7 వేలు ఇచ్చారు. వచ్చే నెల నుంచి రూ.4 వేల చొప్పున ఇవ్వడం సంతోషకరం.
- చొప్పగట్ల సావిత్రమ్మ, కొవ్వూరు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని