logo

శాయశక్తులా శ్రమిస్తా.. సమస్యలు పరిష్కరిస్తా

‘‘పిఠాపురం నియోజకవర్గ పెద్దలకు.. ప్రజలకు.. రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు.. ఫలితాలు వచ్చాక ఇదే నా మొదటి పర్యటన.. ఎన్నికలయ్యాక ఇప్పటివరకు నియోజకవర్గానికి ఎందుకు రాలేదని కొందరు అంటున్నారు.

Updated : 02 Jul 2024 06:20 IST

అభివృద్ధి చేసి చూపించాకే ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటా 

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

‘‘పిఠాపురం నియోజకవర్గ పెద్దలకు.. ప్రజలకు.. రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు.. ఫలితాలు వచ్చాక ఇదే నా మొదటి పర్యటన.. ఎన్నికలయ్యాక ఇప్పటివరకు నియోజకవర్గానికి ఎందుకు రాలేదని కొందరు అంటున్నారు. గెలిచాక ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పనిలోకి వెళ్లాలనుకున్నాను. నేను తీసుకున్నవి చాలా కీలక శాఖలు.వాటన్నింటిపై అవగాహనకు చాలా సమయం పడుతుంది. పాలనలో సవాళ్లు తెలుసుకోవడానికి సమయం తీసుకున్నా.. పింఛన్ల పంపిణీ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఇప్పుడు వచ్చాను.. రాష్ట్రం మొత్తం మనవైపు చూడాలి.. దేశంలోకెల్లా ఉత్తమ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతా’’‘‘ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడలేదు. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిని అవ్వాలనుకున్నాను.  ప్రతి ఓటు సరైన వ్యక్తికి వేశాం.. సరైన కూటమికి వేశామని అనుకునేలా మా పాలన ఉంటుంది’’ 

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్‌  

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి:  కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని సత్యకృష్ణ కన్వెన్షన్‌ హాలులో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేవరకు తన శాయశక్తులా శ్రమిస్తానని అన్నారు. బాధ్యత తీసుకున్నాక డబ్బులు సంపాదించుకోవాలనో.. కొత్తపేరు రావాలనో ఆలోచన తనకు లేదన్నారు. ప్రజల్లో నటుడిగా సుస్థిర స్థానం ఉందని, డబ్బుకు కొదవలేదన్నారు. రాజకీయాలకు డబ్బుతో ఏనాడూ ముడిపెట్టలేదని పేర్కొన్నారు.

జ్యోతిప్రజ్వలన చేస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌.. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వర్మ

అందరూ ఇటువైపు చూసేలా..

పిఠాపురం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ‘కనీస రక్షిత మంచినీరు ఇవ్వడం నా బాధ్యత.. ఉపాధి అవకాశాలు తేవాలి. అర్హులకు పింఛన్లు ఇప్పించాలి. ఇదే నా మొదటి ప్రయత్నం. వ్యవసాయ సమస్యలు, కాలువల పూడికలు.. పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టిసారిస్తా.’ అన్నారు. 

మీ బిడ్డల భవిష్యత్తు కోసం.. 

అయిదో తరగతి చదువుతున్న నక్కా చక్రి అనే బాలుడిని పవన్‌ వేదికపైకి పిలిచారు. ఇలాంటి బిడ్డల భవిష్యత్తు కోసం తాగడానికి మంచినీరు, మంచి చదువు చెప్పించగలిగితే మనం విజయం సాధించినట్లేనన్నారు. నా బిడ్దల కోసం ఎంత తపన పడతానో నాకు తెలీదు గానీ అందరూ నా బిడ్డలే. మాట ఇస్తున్నా.. రెండు తరాలకోసం పనిచేస్తానని అన్నారు.

పింఛను అందించి దివ్యాంగురాలిని పలకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌  

ఈ సంక్షేమం ఆగదు..

కూటమి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైకాపా ప్రజల్ని భయపెట్టిందని.. ఇవేవీ ఆగవని పవన్‌ స్పష్టంచేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పింఛను లబ్ధిదారులు 40,765 మంది ఉంటే.. రూ.27.34 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్య పింఛన్లు 20,396, వితంతు 9,970.. దివ్యాంగులు 4,819.. మత్స్యకారులు 1,498.. చేనేత 997.. కల్లుగీత కార్మికులు 619.. డప్పు కళాకారులు 230..ఇలా ఉన్నారని తెలిపారు. కల్లుగీత కార్మికులు 70వేల మంది ఉంటే 612 పింఛన్లు మాత్రమే ఇచ్చేవారని సంఘ ప్రతినిధి గోవిందరావు చెప్పడంతో అర్హులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి రెండువారాలకోసారి పిఠాపురం వచ్చి వినతులు స్వీకరిస్తానని కలెక్టర్‌ చెప్పారని, ఏమైనా సమస్యలు ఉంటే ఇవ్వాలని సూచించారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, కలెక్టర్‌ షాన్‌ మోహన్, ఎస్పీ సతీష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, భాజపా ఇన్‌ఛార్జి కృష్ణంరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని