logo

విన్నవించినా వైకాపా సర్కారు పట్టించుకోలేదు..

వైకాపా ప్రభుత్వ హయాంలో పలుమార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదంటూ పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు

Published : 02 Jul 2024 05:02 IST

ఫిర్యాదుదారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ జగదీష్‌ 

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: వైకాపా ప్రభుత్వ హయాంలో పలుమార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదంటూ పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. తమ సమస్యలపై అధికారులకు మొర వినిపించారు. మొత్తం 80 అర్జీలు రాగా వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌  పి.ప్రశాంతి చెప్పారు. పరిష్కారం చూపే విషయంలో సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు.

న్యాయం చేయాలంటూ లస్కర్‌ వేడుకోలు: నీటి పారుదల శాఖలో ఎనిమిదేళ్లపాటు పొరుగు సేవల విధానంలో లస్కర్‌గా పనిచేసిన తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని, ఆ పోస్టును వేరొకరికి అమ్ముకుని తనకు ఉపాధి దూరం చేశారని చిట్టాల శేషునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై గతంలో స్పందనలో, ఈ ఏడాది జనవరి 8న భీమవరం వచ్చిన అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రాలు అందించినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారులకు మరోమారు ఫిర్యాదు చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. చాలా మంది నాన్‌లోకల్‌గా పనిచేస్తున్నప్పటికీ తనను మాత్రమే తొలగించారని, ప్రతినెలా రూ.55 వేలు పింఛను తీసుకునే విశ్రాంత ఉద్యోగికి ఆ పోస్టును అమ్ముకున్నారని ఆరోపించారు. పది నెలల వేతనం బకాయి సైతం తనకు చెల్లించలేదన్నారు.

మరణానంతరం 1.20 ఎకరాల భూమి తనకు చెందేలా భర్త వీలునామా రాశారని, దీనికి పట్టాదారు పాసుపుస్తకం కోసం అనేకసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోలేదని రంగంపేట మండలం ఈలకొలనుకు చెందిన మంగయ్యమ్మ అనే వృద్ధురాలు అర్జీ అందించారు. నీ సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, కూలిపని చేసుకుని జీవనం సాగించే తాము అద్దె కట్టుకోలేని స్థితిలో ఉన్నామని ధవళేశ్వరానికి చెందిన సత్య అనే మహిళ చెప్పారు. గత ప్రభుత్వంలో అనేకసార్లు అధికారులను కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వినతులు వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

దానవాయిపేట(రాజమహేంద్రవరం): పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో వచ్చే ప్రతి సమస్య వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పి.జగదీష్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇరవై అర్జీలు అందగా.. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయా స్టేషన్ల సీఐలను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అనిల్‌కుమార్, డీఎస్పీలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని