logo

పవన్‌ కల్యాణ్‌ అనే నేను..

‘‘పవన్‌కల్యాణ్‌ అనే నేను.. అని ప్రమాణం చేస్తున్నప్పుడు అన్నయ్య చిరంజీవి తప్ప.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ చూడలేకపోయారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గుర్తుచేశారు.

Updated : 02 Jul 2024 06:23 IST

పిఠాపురం అభివృద్ధికి తుదిశ్వాస వరకు పనిచేస్తా..

మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ 

పవన్‌ కల్యాణ్‌ అనే నేను.. పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి, ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
- పిఠాపురం నియోజకవర్గ జనసేన సమావేశంలో పవన్‌కల్యాణ్‌ ప్రతిజ్ఞ

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి: ‘‘పవన్‌కల్యాణ్‌ అనే నేను.. అని ప్రమాణం చేస్తున్నప్పుడు అన్నయ్య చిరంజీవి తప్ప.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ చూడలేకపోయారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గుర్తుచేశారు. పిఠాపురం వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో సభ దద్దరిల్లింది. గొల్లప్రోలులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తొలిరోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గ పార్టీ నాయకులు, వీర మహిళలు, వీర సైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పిఠాపురం ప్రజలు చిరస్మరణీయమైన గొప్ప విజయం అందించారన్నారు. అన్ని బాలారిష్టాలు దాటుకుని జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. సెంచరీ కొడితే ఎవరైనా మాట్లాడాలి, కానీ మనం 21 కొడితే అందరూ మాట్లాడుతున్నారని పవన్‌కల్యాణ్‌ అన్నారు. మనది 100 పర్సంట్‌ స్ట్రైక్‌రేట్‌ పార్టీ.. ఇది కార్యకర్తల విజయమని అన్నారు. 

నేను మొండివాడిని..పవన్‌ కల్యాణ్‌ కార్యకర్తల సమావేశంలో ఓ వ్యక్తి ప్రసంగానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడంతో అసహనం వ్యక్తం చేశారు. మీరు మీడియానా అని ప్రశ్నించారు. సమాధానం రాకపోవడంతో ఇది సభ సంస్కారం కాదు, ఆవేశం దేనికని వారించారు. పవన్‌కల్యాణ్‌ అనగానే అందరికీ చులకన అయిపోయింది. వీళ్లకు జగన్‌లాంటి నాయకుడే రైట్‌్. ఇంటర్వ్యూలు ఇవ్వడు. మాట్లాడితే కొడతాడు. బెదిరిస్తాడు. వాళ్లదగ్గర భయంగా, చేతులు కట్టుకుని ఉంటారు. మనం ప్రేమగా ఉంటామని చులకన అని వ్యాఖ్యానించారు. తాను గుండెల్లో పెట్టుకుని మర్యాద ఇస్తానన్నారు. భయాలు లేవని, మొండివాడినని, పట్టుబడితే వదలనని గుర్తుపెట్టుకోవాలన్నారు. పద్ధతిగా ఉండాలని, ప్రొటోకాల్‌ నియమాలు పాటించాలన్నారు. వ్యవస్థను నడపాల్సిన వ్యక్తిగా గట్టిగా ఉండక తప్పదన్నారు. పదే..పదే.. అసౌకర్యానికి గురి చేయడంతో ఉంటే ఉండండి, లేకపోతే వెళ్లిపోండి అన్నారు. సదరు వ్యక్తి మీడియా కాదని గుర్తించి పోలీసులు బయటకు తీసుకెళ్లారు.

 ఫ్యాన్లు పక్కన పెట్టేశాం..

కార్యకర్తల సమావేశంలో ఉక్కపోతగా ఉండటంపై పవన్‌ మాట్లాడుతూ ఫ్యాన్లు తీసేశాం, ఏసీలే ఉన్నాయ్‌.. అనగానే సభలో నవ్వులు విరిశాయి. నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ఈ ప్రాంతం రూపు మారితే ఉపాధి, ఉద్యోగాలకు కొదవ లేదన్నారు. పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున తనను ఊరేగించండి అన్నారు. 

మీ కష్టం చూసి కన్నీళ్లొచ్చాయి..

తనను, జనసేనను గెలిపించడానికి మీరు పడ్డ కష్టం చూస్తే కన్నీళ్లు వచ్చాయని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి సొంత ఖర్చులతో వచ్చి తిరిగారన్నారు. మీ ప్రేమకు ఎన్నిసార్లు శిరసు వంచి నమస్కరించినా సరిపోదని ఉద్వేగానికి గురయ్యారు. మీరు పార్టీకే కాదు, 5కోట్ల మంది ప్రజలకు ధైర్యాన్నిచ్చారన్నారు. ఇంత చేసిన మీకోసం ఎంతైనా కష్టపడతానని భరోసా ఇచ్చారు. తెలంగాణ వాళ్లు కూడా నన్ను రమ్మంటున్నారని పవన్‌ అన్నారు. వెళ్లొద్దని.. కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కున చేర్చుకున్న పిఠాపురాన్ని వదిలి వెళ్తానా? అని అన్నారు. జనసేన జాతీయ అధికార ప్రతినిధి అజయ్‌కుమార్, నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని