logo

వైద్యులు అంకితభావంతో సేవలందించాలి

వైద్యులు అంకితభావంతో సేవలందించాలని ప్రముఖ అంకాలజిస్ట్‌ పద్మశ్రీ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు

Published : 02 Jul 2024 04:38 IST

పద్మశ్రీ డా.నోరి దత్తాత్రేయుడు

వైద్యసిబ్బందిని సత్కరిస్తున్న డా.నోరి, తదితరులు 
రాజానగరం, రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: వైద్యులు అంకితభావంతో సేవలందించాలని ప్రముఖ అంకాలజిస్ట్‌ పద్మశ్రీ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు. రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ వైద్యకళాశాల, జనరల్‌ ఆసుపత్రిలో డాక్టర్స్‌ డే సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన యువ వైద్యులు, వైద్య విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్‌ఎల్‌ వైద్యకళాశాల, జనరల్‌ ఆసుపత్రి నెలకొల్పి 20 ఏళ్లు అయిన సందర్భంగా అప్పటినుంచి సంస్థలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది వంద మందిని దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. అంతర్జాతీయ ఫుడ్‌ సర్వీసుల సంస్థ సొడెక్సో ‘జీఎస్‌ఎల్‌ అమ్మ భోజన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. రోగులకు శుచిగా, రుచిగా  రూ.10కే అందజేస్తున్నామని, దీనికయ్యే ఖర్చులో కొంతభాగం రాయితీ రూపంలో భరిస్తున్నట్లు విద్యాసంస్థల ఛైర్మన్‌ డా.గన్ని భాస్కరరావు వివరించారు. ఆసుపత్రి, కళాశాలలో అన్ని విభాగాలను డా.నోరి సందర్శించారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొగ తాగడం, పొగాకు నమలడం మానేయడం, ముందస్తు వైద్యపరీక్షల ద్వారా క్యాన్సర్‌ను 98 శాతం నివారించుకోవచ్చని పేర్కొన్నారు. కొందరు పొగాకు నమలడం, పొగతాగడం వంటివి గత కొన్నేళ్లుగా చేస్తున్నామని, ఇప్పటికిప్పుడు మానేస్తే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారని, అది వాస్తవం కాదన్నారు. ఆ దురలవాట్లను మానేస్తే శరీరంలో క్యాన్సర్‌ కారకాల పెరుగుదల నిలిచిపోతుందన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే కుటుంబ సభ్యులు ముందస్తుగా వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకచోట పరీక్ష చేయించుకున్నాక దానిని నిర్ధారిం
చుకోవడానికి రెండో అభిప్రాయం తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్‌ ఆసుపత్రి డైరెక్టర్, సర్జికల్‌ అంకాలజిస్ట్‌ డా.తరుణ్‌ గోగినేని, రేడియేషన్‌ అంకాలజిస్ట్‌ డా.పీబీ ఆనందరావు, జీఎస్‌ఎల్‌ ఆసుపత్రుల మెడికల్‌ సూపరింటెండెంట్లు 
డా.వేణుగోపాల్, బ్రిగేడియర్‌ డా.టీవీఎస్‌పీ మూర్తి, ప్రిన్సిపల్‌ మేజర్‌ జనరల్‌ డా.వి.గురునాథ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెదేపా నాయకుడు 
గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

అవగాహన పెంచుకుంటే క్యాన్సర్‌ నిర్మూలన సాధ్యం

ప్రజలు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని వ్యాధిపై అవగాహన పెంచుకుంటేనే క్యాన్సర్‌ నిర్మూలన సాధ్యమవుతుందని డాక్టర్‌ దత్తాత్రేయుడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిని సందర్శించి కొత్తగా ఏర్పాటు చేసిన మూడు క్యాన్సర్‌ చికిత్స యూనిట్లను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యున్నత పరికరాలు, నైపుణ్యం కలిగిన ఆసుపత్రి ఇది అని కొనియాడారు. గ్రామీణ ప్రాంతంలో అత్యంత ఆధునిక వైద్యచికిత్స పరికరాలను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన డా.గన్ని భాస్కరరావును ఆయన అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని