logo

పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి

పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు.

Updated : 01 Jul 2024 05:03 IST

ఉప ముఖ్యమంత్రిపై జిల్లావాసుల కోటి ఆశలు
బాధ్యతలు చేపట్టాక తొలిసారి జనసేనాని రాక నేడు

జగనన్న కాలనీ కోసం దుమ్ములపేట శివారులో మడ అడవులను ధ్వంసం చేసిన ప్రాంతం

పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో పలు సభల్లో స్థానిక సమస్యలపై  గళమెత్తిన జనసేనాని అధికారంలోకి రాగానే పరిష్కారం చూపుతామని ప్రజల్లో భరోసా నింపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి జిల్లాకు పవన్‌కల్యాణ్‌  వస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం కాకినాడ జిల్లాకు రానున్నారు. పర్యవేక్షిస్తున్న శాఖల్లోని సమస్యలతోపాటు ఉమ్మడి జిల్లాలో అయిదేళ్ల వైకాపా పాలనలో గాడితప్పిన పరిస్థితులూ చక్కదిద్దాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 

హరిత వనాలకు ఊపిరినివ్వాలి

అయిదేళ్ల వైకాపా పాలనలో వనాల విధ్వంసం, పర్యావరణ విఘాతం ఇష్టారీతిన సాగింది. 

  • కాకినాడ శివారు దుమ్ములపేటలో 90 ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు ఉంటే.. 58 ఎకరాల్లో నరికేసి.. ఈ ప్రాంతాన్ని లేఔట్‌గా మార్చేశారు.  
  • అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అల్లవరం, కాట్రేనికోన మండలాల్లోని వందల ఎకరాల చిత్తడి నేలల్లోని మడ వనాలు ధ్వంసం చేసి కొందరు ఆక్వా సాగు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ మండలంలో రక్షిత అటవీప్రాంతం లేదంటూ దాటేస్తున్నారే తప్ప పచ్చదనాన్ని కాపాడే చొరవ చూపడంలేదు.
  • తాళ్లరేవు మండలంలోని కోరింగ అభయారణ్యం విభిన్న జీవరాశులకు ఆవాసం. ఇక్కడ సారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. వనాలు ధ్వంసం చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నా చర్యలు లేవు.

చుట్టూ నీరే.. తాగాలంటే బేజారే..

అందుబాటులో గోదావరి ఉన్నా నేటికీ పూర్తిస్థాయి నీరు అందని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో పంచాయతీల్లో 2,277 ఆవాస ప్రాంతాలుంటే.. అందులో 1,454 ఆవాసాలకు మాత్రమే రక్షిత మంచి నీటి అందుతోంది. మిగిలినచోట్ల ఇతర పథకాల్లో నీటిని అందిస్తున్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందించే లక్ష్యం నిధుల లేమితో నెరవేరడంలేదు. ్య జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టును రూ.1,203 కోట్లతో ఏర్పాటు చేయాలన్న లక్ష్యం సాకారం కాలేదు. గుత్తేదారులు చేసిన పనులకు రూ.83 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ్య తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.4,500 కోట్లతో ప్రతిపాదించిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును.. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.1,650 కోట్లకు కుదించింది. అయినా ఇది పట్టాలెక్కలేదు. 20.81 లక్షల మందికి స్వచ్ఛ జలాలు అందించే ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. మేఘ ఇంజినీరింగ్‌ సంస్థ 2025 జూన్‌ 25 నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉన్నా ఇంకా మొదలు కాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.

దారులు ధ్వంసం చేసి పడేశారు..

వైకాపా పాలనలో గ్రామీణ రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎక్కడికక్కడ గుంతలు పడి ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయినా పరిస్థితి చక్కదిద్దే చొరవ మాత్రం చూపలేదు. తాత్కాలిక, శాశ్వత మరమ్మతులకు పంపిన ప్రతిపాదనలకు గత ప్రభుత్వంలో మోక్షం దక్కలేదు. గనుల అక్రమ తవ్వకాలు, తరలింపు క్రమంలో భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు నాశనమైనా పట్టించుకోలేదు.   

పి.గన్నవరం మండలం ముంగండ నుంచి ఇసుకపూడి వెళ్లే మార్గం సగానికిపైగా దెబ్బతిన్నా చర్యల్లేవు.  మానేపల్లి ఏటిగట్టు నుంచి శివాయిలంక రోడ్డు, పప్పులవారిపాలెం నుంచి కుందాలపల్లి మీదుగా వెళ్లే దారులు దెబ్బతిన్నా చక్కదిద్దే చర్యలు లేవు.

ప్రోత్సహిస్తే.. శాస్త్ర- సాంకేతిక ఫలాలు

అంబాజీపేటలో 1955లో కొబ్బరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం 22 రకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కొబ్బరికి ఊతమిచ్చి.. సస్యరక్షణ, నాణ్యత, దిగుబడి, ఆదాయం పెంపు తదితర అంశాలపై దృష్టిపెడితే.. 60 వేల మంది రైతులకు, లక్ష మంది కార్మికులకు ఊతమిచ్చినట్లవుతుంది. ్య కాకినాడలోని జగన్నాథపురంలో రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ) ఉంది. ఇక్కడ పీసీఆర్, మైక్రో బయాలజీ, హిస్టోపెథాలజీ, నీరు- మట్టి పరీక్షలు, ఫీడ్‌ ఎనాలసిస్‌ తదితర ల్యాబ్‌ల సామర్థ్యం పెంచుతూ ప్రోత్సహించాల్సి ఉంది. 

ఈనాడు, కాకినాడ

పల్లె పల్లెలో సమస్యల సిత్రాలే.. 

పల్లెకు అయిదేళ్లూ ప్రభుత్వ ప్రోత్సాహమే లేదు. ఊతమివ్వాల్సిందిపోయి పంచాయతీ గల్లాపెట్టె సైతం వైకాపా సర్కారు ఖాళీచేసిన పరిస్థితి. ్య తెదేపా ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సంపద సృష్టికేంద్రాలు వైకాపా అధికారంలోకి వచ్చాక మూలనపడ్డాయి. కాకినాడ జిల్లాలో 277, తూగో జిల్లాలో 257, కోనసీమ జిల్లాలో 256 కేంద్రాలు నిర్మించారు. వీటిని వినియోగించకుండా.. గ్రామాల్లో రోడ్ల పక్కనే చెత్త కుప్పలుగా పోస్తున్నారు. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. 

కాకినాడ గ్రామీణ మండలం పండూరు వద్ద చెత్త నుంచి సంపద కేంద్రం వద్ద ఇలా.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని