logo

ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం

పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది.

Published : 01 Jul 2024 04:53 IST

జిల్లాలో 2,44,302 మందికి రూ.165.13 కోట్లు ఇంటివద్దే పంపిణీ
4,092 మంది సిబ్బంది సేవలు వినియోగం

పింఛనుదారులు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం కలెక్టరేట్‌ : పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో పింఛన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. సోమవారం ఉదయం 5 గంటలకే సన్నద్ధంగా ఉండాలని సిబ్బందిని  ఆదేశించారు.  

జిల్లాలో మొత్తం 2,44,302 మందికి అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం రూ.165.13 కోట్లు పంపిణీ చేయనున్నారు. దీనికోసం 4,092 మంది సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్‌ మాసాలకు సంబంధించి నెలకు రూ.వెయ్యి చొప్పున కలిపి ప్రస్తుత నెల మొత్తం రూ.7 వేల చొప్పున లబ్ధిదారులకు అందించనున్నారు. దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచిన పింఛనుతో పాటు మిగతా కేటగిరీలకు ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పంపిణీ ఒక పండగలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌ నిడదవోలు నియోజకవర్గం గోపవరం గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు.  

ఈసారి అదనంగా పెంపు..

 వైకాపా ప్రభుత్వం వివిధ సాకులు చూపుతూ కోత పెడుతూ వచ్చింది. మే నెలకు సంబంధించి జిల్లాలో 2,43,007 మందికి అందించగా జూన్‌లో వారి సంఖ్యను 2,42,300కు తగ్గించేసింది. వివిధ కారణాలు చూపి కోత పెట్టింది. ఈసారి కూటమి ప్రభుత్వంలో 2,44,302 మంది లబ్ధిదారులుగా గుర్తించి పింఛను అందించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని