logo

అడుగులు పడేనా?

టీ-20 ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్‌ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్‌ పోటీల్లో అడుగుపెట్టిన భారత్‌ సెమీఫైనల్‌ (ఇంగ్లాండ్‌),  ఫైనల్స్‌ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది.

Published : 01 Jul 2024 04:50 IST

జిల్లాలో క్రీడామండలి ఏర్పాటు ఎప్పుడు  
వర్ధమాన క్రీడాకారుల ఎదురుచూపులు

క్రికెట్‌ ఆడుతున్న బాలలు

న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌ : టీ-20 ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్‌ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్‌ పోటీల్లో అడుగుపెట్టిన భారత్‌ సెమీఫైనల్‌ (ఇంగ్లాండ్‌),  ఫైనల్స్‌ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. ఈ విజయం నుంచి స్ఫూర్తి పొందుతున్న నేటి యువత తమ కల సాకారం చేసుకునేందుకు మైదానంలో కష్టపడు తున్నారు. జిల్లాలో అటువంటి సౌకర్యాలు లేక ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి సాధన చేయాల్సి వస్తోంది. నూతన జిల్లాలుగా రూపాంతరం చెందిన తర్వాత అటువంటి క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని వర్ధమాన క్రీడా కారులు కోరుకుంటున్నారు.

తూర్పులో వెతుకులాట

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను ఎక్కువగా ఆదరించే దేశాల్లో భారత్‌ మొదటి వరుసలో ఉంటుంది. గల్లీ నుంచి దిల్లీవరకు ప్రతిఒక్కరు ఆడుతుంటారు. రాష్ట్రంలో జిల్లా క్రికెట్‌ సంఘాల ఆధ్వర్యంలో క్రికెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మాత్రం శూన్యం. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలతో జిల్లా క్రికెట్‌ సంఘం ఒప్పందం చేసుకొని అక్కడి క్రీడా మైదానంలో క్రికెట్‌ను అభివృధ్ధి చేశారు. పచ్చని మైదానంతో పాటు ఆరు నెట్‌లు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా అంబాజీపేట ప్రభుత్వ పాఠశాలలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశారు. దీంతో అక్కడి నుంచి క్రీడాకారులు రాష్ట్రసాయి, విజ్జీ ట్రోఫీ, రంజీ మ్యాచ్‌ల వరకు వెళుతున్నారు. బండారు అయ్యప్ప వంటి క్రీడాకారులు ఐపీఎల్‌ వరకు వెళ్లగలుగుతున్నారు. తూర్పులోనూ క్రికెట్‌ సంఘం స్థల సేకరణకు వెతుకులాట ప్రారంభించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీనికి కారణం ఆ సంఘ సభ్యులు లేకపోవడమే. మరోవైపు వర్గవిభేదాల కారణంగా అడుగులు పడలేదు. 

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం  

మాజీ ఎంపీ మార్గని భరత్‌ పదేపదే రాజమహేంద్రవరంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చి కనీసం స్థల సేకరణ కూడా చేయలేకపోయారు.  నాగులచెరువు స్టేడియాన్ని క్రికెట్‌ స్టేడియంగా మారుస్తానని చెప్పినప్పటికీ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. ఆర్ట్స్‌ కళాశాలలో నిర్మిస్తానని మరోసారి చెప్పగా అక్కడి విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించి ర్యాలీలు చేపట్టారు. దీంతో ఎంపీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కనీసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్‌ సంఘ సహకారంతో స్థల సేకరణ చేసి ఇచ్చినా క్రికెట్‌ స్టేడియం నిర్మాణం జరిగేదని క్రీడాకారులు అంటున్నారు.

ముగ్గురు కోచ్‌లతో మమ

జిల్లాలో ఇప్పటివరకు జిల్లా క్రీడామండలి ఏర్పాటు కాలేదు. కేవలం ముగ్గురు కోచ్‌ల నియామకం చేసి చేతులు దులిపేసుకుంది. కోచ్‌లకు ఒక గదిని మాత్రమే కేటాయించి వదిలేశారు. క్రీడామండలి ఏర్పాటు చేయాలంటే కనీసం 20 నుంచి 30 ఎకరాల స్థలం కావాలి. అక్కడ అథ్లెటిక్‌ ట్రాక్‌తో పాటు మూడు ఇండోర్‌ స్టేడియాలు, స్విమ్మింగ్‌ పూల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్‌బాల్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్‌ వంటి క్రీడలకు కోర్టుల నిర్మాణం జరగాలి. ఒక్కో క్రీడకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. దీంతో జిల్లాలో క్రీడాభివృద్ధికి భీజాలు పడటం లేదు.

స్థలం కోసం నిరీక్షణ

జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి సంఘం కట్టుబడి ఉంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మైదానాలు ఏర్పాటు చేసినట్లే రాజమహేంద్రవరంలో కూడా ఏర్పాటుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కనీసం 5 ఎకరాల స్థలం లభ్యమైతే రాష్ట్ర క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్‌ను అభివృద్ధి చేస్తాం.

కె.సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి

ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు

జిల్లాలో క్రీడామండలి ఏర్పాటుకు గతంలో కలెక్టరు, జేసీ దృష్టికి తీసుకువెళ్లాం. స్థల సేకరణ జరగాల్సి ఉంది. రాజమహేంద్రవరం గ్రామీణంలో ఐదెకరాల స్థలాన్ని గుర్తించాం. అక్కడ మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి నాయకులు, అధికారులు చొరవ చూపిస్తే స్టేడియం నిర్మాణం వేగంగా జరిగే అవకాశం ఉంది.

డి.శేషగిరి, జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని