logo

అమృత హస్తాలు

అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో.

Published : 01 Jul 2024 04:44 IST

నేడు వైద్యుల దినోత్సవం 

 

వైద్యశాలలో రోగితో మాట్లాడుతున్న  గోలి రామారావు 

అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో  కొంతమంది వైద్యులు ఉచితంగా సేవలందిస్తూ, మందులు అందజేస్తూ, అవగాహన కల్పిస్తూ తమ పవిత్ర వృత్తికి మరింత వన్నె తెస్తున్నారు. మరికొందరు రెండు, మూడు తరాలుగా ఈ వృత్తిని కొనసాగిస్తూ తమ ప్రత్యేకత చాటుతున్నారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

వారానికో రోజు..

రాజమహేంద్రవరం సాంస్కృతికం: రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ధర్మ వైద్యశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోజూ ఉచిత వైద్యసేవలు అందుతాయి. నగరానికి చెందిన కొంతమంది వైద్యులు వారానికి ఒకరోజు వచ్చి వైద్యం చేస్తుంటారు. ఈ సేవలు పేదలకు వరంగా ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి నిపుణులైన వైద్యబృందం ఒక్కోరోజు సేవలు అందిస్తారు. ఆదివారం సెలవు దినం. వారమంతా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు డాక్టర్‌ కె.రామ చంద్రరావు, డాక్టర్‌ పి.వి.సుబ్బారావు అందుబాటులో ఉంటారు.

పరీక్షలు చేస్తున్న కాశిన ప్రభాకర్‌ 

సేవా ‘ప్రభాకరం’

మామిడికుదురు: తన ఆసుపత్రిలో వారానికోసారి ఉచిత వైద్యం అందిస్తూ, అన్నదానం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.. డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం జగ్గన్నపేటకు చెందిన వైద్యుడు కాశిన ప్రభాకర్‌. గ్రామంలోని సత్యసాయి కల్యాణ మండపం ప్రతి గురువారం దాదాపు 125 మందికి ఉచిత వైద్యం చేస్తుంటారు. ప్రతి నెలా మొదటి గురువారం ఆసుపత్రి వద్ద ఉచిత కంటి వైద్యం, శస్త్ర చికిత్సలను పరమహంస యోగానంద కేంద్రంతో నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి కళ్లజోళ్లను అందజేస్తున్నారు. అదే రోజు స్థానిక గ్రామాల ప్రజలకు ఉచిత హోమియో వైద్యాన్ని అందిస్తున్నారు. ఏటా నాలుగుసార్లు పుట్టపర్తిలోని అత్యాధునిక ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారు. దీంతోపాటు మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలకు బృందంగా వెళ్లి సేవ చేస్తారు. ఏటా సత్యసాయి జయంత్యుత్సవాల సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని పెడుతుంటారు. ఆధ్యాత్మిక భావన పెంపొందిస్తూనే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడంపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు.

రోజువారీ అందే సేవలు ఇలా...

  • సోమ: కె.అనూష (ఎండీ జనరల్‌ మెడిసిన్‌), దుద్దుపూడి రామారావు (ఆర్ధోపెడిక్‌)
  • మంగళ: కవికొండల రఘు (ఆర్ధోపెడిక్‌), కస్తూరి సుబ్రహ్మణ్యం (జనరల్‌ మెడిసిన్‌)
  • బుధ: ఎస్‌.వి.రమణ (జనరల్‌ మెడిసిన్‌), పద్మలత (గైనకాలజిస్ట్‌), రఘురామ్‌ (ఆర్ధోపెడిక్‌)
  • గురు: గోలి రామారావు (జనరల్‌ మెడిసిన్‌), 
  • ప్రదీప్‌ గంధర్వ (ఆర్ధోపెడిక్‌), 
  • నిఖిత పాతూరి (జనరల్‌ మెడిసిన్‌)
  • శుక్ర: దుద్దుపూడి రామారావు (ఆర్ధోపెడిక్‌), 
  • వల్లేపల్లి రామకృష్ణ (జనరల్‌ మెడిసిన్‌)
  • శని: కస్తూరి సుబ్రహ్మణ్యం (జనరల్‌ మెడిసిన్‌), శ్రీకృష్ణ పాతూరి (ఆర్ధోపెడిక్‌)

ఆన్‌లైన్‌లో సేవలు..

రాజమహేంద్రవరం వైద్యం: డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన డాక్టర్‌ పి.బాలసూర్య మాణిక్యాంబ గ్రామీణ ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తుండగా, నెలకు రెండుసార్లు గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు అందిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో వైద్య రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మూడేళ్ల నుంచి ఈ సేవలు అందిస్తున్నారు. గతంలో చికిత్స పొందిన రోగులు రెండోసారి వ్యయ ప్రయాసలకోర్చి ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా భర్త డాక్టర్‌ రామ్‌గోపాల్‌తేజ సహకారంతో నేరుగా ఆన్‌లైన్‌ వీడియోకాల్‌ ద్వారా వైద్యం అందించి, మందులు సూచిస్తున్నారు.

నాన్న స్ఫూర్తితో..

మసీదు సెంటర్‌(కాకినాడ): తండ్రి కల్లయ్య స్ఫూర్తితో వైద్యరంగంలోకి వచ్చిన వెంకటేశ్వర్లు జీజీహెచ్‌లోని పీడియాట్రిక్స్‌ విభాగంలో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ, విశేష సేవలు అందిస్తున్నారు. ఈయన భార్య సత్య సునీత రేడియాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. వీరు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆసుపత్రిలోని పీడియాట్రిక్స్‌ విభాగానికి అవసరయ్యే వైద్య పరికరాలు సమకూరుస్తున్నారు. అనాథాశ్రమంలో పిల్లలకు, వృద్ధులకు సాయం చేస్తుంటారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు ఇస్తారు.

మూడు తరాలుగా..

పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన నాయని కుటుంబంలో మూడు తరాలుగా వైద్యులు ఉన్నారు. తండ్రి నాయని రంగారావు మొదటిసారి వైద్య వృత్తిని చేపట్టగా అదే పంథాను కొడుకు సురేష్, మనుమడు సందీప్‌ కొనసాగిస్తున్నారు. రంగారావు మద్రాసు మెడికల్‌ కళాశాలలో చదివారు. 1969 వరకు ప్రభుత్వ వైద్యునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. సురేష్‌ ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో 1977లో చదివారు. 1978 నుంచి పెద్దాపురం పట్టణంలో ప్రైవేటు వైద్యునిగా పనిచేస్తున్నారు. సందీప్‌ కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్, మణిపాల్‌లో ఎండీ, తిరువనంతపురంలోని శ్రీచిత్ర కళాశాలలో డీఎం(న్యూరాలజీ) చదివారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో న్యూరాలజిస్టుగా పనిచేస్తున్నారు.

ఆ ఊళ్లో 15 మంది వైద్యులు

తుని గ్రామీణం: అదో చిన్న గ్రామం.. అయితేనేం అక్కడ సుమారు 15 మంది వైద్యులు ఉన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో సుమారు 400 కుటుంబాలు ఉంటున్నాయి. అందరూ చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయాన్ని నమ్ముకున్న వారే. పదేళ్ల క్రితం వరకు అక్కడ వైద్యుడు అనే వారే లేరు. మొదటిసారిగా బోజంకి రామకృష్ణ వైద్య రంగంలోకి అడుగుపెట్టి తునిలో ప్రైవేటు ఆసుపత్రి పెట్టుకున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పలువురు అదే బాటలో నడిచారు. ప్రస్తుతం వెలమకొత్తూరు నుంచి 15 మందికి పైగా వైద్యులు ఉన్నారు. కొందరు పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. 

ఒకే కుటుంబంలో నలుగురు..

కోరుకొండ: ఆ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు వైద్యులు ఉన్నారు. మరొకరు భావి వైద్యురాలు. కోరుకొండకు చెందిన ఓగిరాల వెంకట ఇందిర రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో సివిల్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె కుమారుడు గోపాల శ్రీనివాస శర్మ రాజమహేంద్రవరంలో వైద్యుడు. కుమార్తె రాజ్యలక్ష్మి న్యూరో ఫిజీషియన్‌. మనుమరాలు ఇందిర మహతి వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఇందిర 63 ఏళ్ల వయసులోనూ వైద్య వృత్తిని కొనసాగిస్తూనే నాట్యంలో రాణిస్తున్నారు. ఆరేళ్లుగా ఇందులో శిక్షణ పొంది హైదరాబాద్, రాజమహేంద్రవరం, బెంగళూరు, తిరుపతి తదితర నగరాల్లో సుమారు 50 ప్రదర్శనలు ఇచ్చారు. మహానంది, నాట్య మంజరి, మంజీర పురస్కారాలు పొందారు. జానపద నృత్యోత్సవంలో ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకున్నారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, 100 గంటల నిర్విరామ నృత్య పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని