logo

ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు

సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు.

Published : 01 Jul 2024 04:27 IST

లారీ ఢీకొని తాతా, మనుమడు దుర్మరణం 

వీర్రాజు, ధనుష్‌ చంద్ర (పాత చిత్రాలు)

కొవ్వూరు పట్టణం: సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కొవ్వూరు ఒకటో వార్డు రాజీవ్‌కాలనీకి చెందిన మాసా వీర్రాజు(55)కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు సునందను కుమారదేవానికి చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. వారి కొడుకు ధనుష్‌ చంద్ర(12) ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఎప్పుడు సెలవులు వచ్చినా ధనుష్‌ను కొవ్వూరు తీసుకురావడం వీర్రాజుకు అలవాటు. అలాగే ఆదివారం ఉదయం ఆయన కుమారదేవం వెళ్లి, ఇద్దరూ కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. ఆరికిరేవుల -కొవ్వూరు మధ్య పాశాలమ్మ గుడి దగ్గర ఎదురుగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. తాతా, మనుమడు తలలకు తీవ్ర గాయాలై మృతిచెందారు. పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు అక్కడకు చేరుకుని మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధనుష్‌ తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. కూలి పనులు చేసుకుని జీవించే వీర్రాజు భార్య నాగమణి ఏడాది క్రితం పాము కాటేయడంతో మృతి చెందారు.

దిల్లీ పోలీసులమన్నారు.. రూ.లక్షలు దోచుకున్నారు..

రాజమహేంద్రవరం నేరవార్తలు: మనీ లాండరింగ్‌ కేసులో మీ పేరు ఉందని దిల్లీ పోలీసుల పేరుతో వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.35 లక్షలు దోచుకున్న ఘటన రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరయ్యగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు.. మున్సిపల్‌ కాలనీలో నివాసముంటున్న వ్యాపారి ఎన్‌.మతూషల ఫామ్‌రాజ్‌కు గత నెల 17న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘దేశంలోనే అతిపెద్ద ఇల్లీగల్‌ నగదు లావాదేవీ జరిగింది.. అందులో మీ పేరు, ఆధార్‌ నంబరుతో ఉన్న ఓ బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు ఉన్నాయి.. దానికి సంబంధించి దిల్లీ పోలీసులు మీకు ఫోన్‌ చేసి మాట్లాడతారు..’ అని భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం పది నిమిషాల వ్యవధిలోనే ఫామ్‌రాజ్‌ వాట్సాప్‌కు ఓ వీడియో కాల్‌ వచ్చింది. అవతల పోలీసు దుస్తులతో ఉన్న వ్యక్తి తాను దిల్లీ ఐపీఎస్‌ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మనీ లాండరింగ్‌ కేసులో దిల్లీ సీబీఐ పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేసి దిల్లీ తీసుకువెళ్తారని బెదిరించడం మొదలుపెట్టాడు. విచారణకు సహకరిస్తే అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశం కల్పిస్తానని నమ్మబలికాడు. ముందుగా బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఆయన భార్య, కుటుంబీకుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌సీ కోడ్‌తో సహా పూర్తి వివారాలు తీసుకున్నాడు. అనంతరం కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు పంపాలని సూచించాడు. బెదిరిపోయిన రాజ్‌ ఆ నగదు ఆన్‌లైన్‌లో జమచేశారు. మరో రెండు దఫాలుగా ఫోన్‌చేసి మరో రూ.1.85 లక్షలు వరకు జమ చేయించుకుని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930 సైబర్‌క్రైమ్‌ నంబరుకు గత నెలలో ఫిర్యాదు చేశారు. సైబర్‌క్రైమ్‌ వర్గాల సమాచారంతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని