logo

పవన్‌ రాకకు భారీ ఏర్పాట్లు

పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు.

Published : 01 Jul 2024 04:20 IST

ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న డీఎస్పీ హనుమంతరావు

పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి: పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు ఒక డీఎస్పీ, 8 మంది సీఐలు, 20మంది ఎస్సైలు, 200మంది సిబ్బంది, 8 రోప్‌ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ నివాసం వద్ద అర్జీలు స్వీకరణ ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లు సిద్ధం చేశారు. పవన్‌ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తొలిసారి పిఠాపురం విచ్చేస్తున్న సందర్భంగా అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  

షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్‌ల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 7.20 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 9 గంటలకు గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులో ఆయన నివాసానికి చేరుకుంటారు. 9.45 గంటలకు అక్కడ నుంచి గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకూ అక్కడే ఉంటారు. ఒంటి గంటకు తిరిగి చేబ్రోలులోని ఆయన నివాసానికి వెళ్తారు.

పింఛన్ల పంపిణీ వద్ద పటిష్ఠ బందోబస్తు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం పింఛన్ల పంపిణీ చేసే సత్యకృష్ణ ఫ£ంక్షన్‌ హాలు వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. జనసేన జాతీయ అధికార ప్రతినిధి అజయ్‌ కుమార్‌తో కలిసి గొల్లప్రోలులోని ఆ కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించారు. చేబ్రోలులోని పవన్‌ నివాసం వద్ద కూడా చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపించేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. సీఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

యు.కొత్తపల్లిలో కలెక్టర్‌ పర్యటన

ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సగిలి యు.కొత్తపల్లి మండలంలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఉప్పాడ తీరానికి చేరుకున్న ఆయన ఆయా ప్రాంతాల్లో కోతకు గురైన ప్రదేశాలను పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడి కోత ప్రభావం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హార్బర్‌ నిర్మాణ పనులను పరిశీలించి స్థితిగతులను తెలుసుకున్నారు. బోటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సభా వేదిక వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.రమణి, ర.భ.శాఖ ఎస్‌ఈ క్రాంత్, జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్, ఆర్డీవో ఇట్ల కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని