logo

ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..

అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్‌ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.

Updated : 01 Jul 2024 04:14 IST

ముమ్మిడివరం: పళ్లవారిపాలెంలో చెత్త సంపద కేంద్రం ఇలా..

అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్‌ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి. ఆ ప్రభావం ఇప్పుడు ఊరూరా స్పష్టంగా కనిపిస్తోంది.

న్యూస్‌టుడే, ముమ్మిడివరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే అందించాల్సిన ఆవశ్యకత ఉందని ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులు ఎంత దారి మళ్లాయనే లెక్కలనుసైతం బయటపెట్టారు. ఇకపై కూటమి పాలనలో గ్రామ పంచాయతీలకు మంచి రోజులు రానున్నాయనేది ఆయన మాటల సారాంశమని నిపుణులు పేర్కొంటున్నారు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో..

జిల్లాలో 385 గ్రామ పంచాయతీలున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను పెద్దఎత్తున దారి మళ్లించారు. ఆర్థిక సంఘం నిధుల వ్యయానికి తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నిధులన్నీ విద్యుత్తు ఛార్జీలకు లాగేసుకోవడంతో కనీసం బ్లీచింగ్‌ కొనడానికి సొమ్ములేని పరిస్థితులను గ్రామ పంచాయతీలు ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో అధ్వానంగా మారిన పరిస్థితులను చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

సాకారం కాని స్వచ్ఛ సంకల్పం..

గతంలో చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.కోట్లు వెచ్చించి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు నిర్మించారు. వీటికి గ్రామాల్లో సేకరించిన చెత్తను తరలించి అక్కడ వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసేవారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ద్వారా టన్నుల మేర వర్మీకంపోస్టును తయారుచేసిన పరిస్థితులున్నాయి. అప్పట్లో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, రిక్షాలు, ఫాగింగ్‌ యంత్రాలు తదితర సామగ్రిని అందించారు. వైకాపా ప్రభుత్వంలో అవన్నీ మూలకుచేరాయి. 

కూటమి ప్రభుత్వ ఆదేశాలతో..

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 385 గ్రామ పంచాయతీల్లో 840 తాగునీటి ట్యాంకులు(ఓహెచ్‌బీఆర్‌)ల ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకుల క్లోరినేషన్, ప్రాజెక్టుల వద్ద నీటిశుద్ధి వంటి వాటిని అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయడం ప్రారంభించారు. 

నిధుల సమస్య లేదు..

గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి నిధుల సమస్య లేదు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం చివరి విడత నిధులు గ్రామ పంచాయతీ ప్రత్యేక ఖాతాల్లో జమయ్యాయి. గ్రామ పంచాయతీ సాధారణ నిధులను కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించాలని సూచించాం. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి క్లోరినేషన్‌ చేయిస్తున్నాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తున్నాం. 

డి.రాంబాబు, జిల్లా పంచాయతీ అధికారి 

జిల్లా సమాచారం ఇలా..

మొత్తం గ్రామ పంచాయతీలు: 385
3 వేలలోపు జనాభా ఉన్నవి: 190
3 వేలకుపైగా జనాభా ఉన్నవి: 195 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని