logo

ఇంకా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నన్నయ విశ్వవిద్యాలయంలో మాత్రం ఇంకా వైకాపా వాసనలు పోవడం లేదు.

Updated : 30 Jun 2024 09:40 IST

వైకాపా మార్కు నన్నయ విశ్వవిద్యాలయం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నన్నయ విశ్వవిద్యాలయంలో మాత్రం ఇంకా వైకాపా వాసనలు పోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఉప కులపతులు రాజీనామాలు చేస్తున్నా.. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సమీప బంధువైన నన్నయ వీసీ పద్మరాజు మాత్రం ఇంకా కుర్చీని వదిలేందుకు ఇష్టపడటం లేదన్న చర్చ నడుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో 432 అనుబంధ కళాశాలలతో 2006లో ఏర్పాటైన ఈ వర్సిటీ పరిధిలో సుమారు 1.32 లక్షల మంది చదువుతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు ఉపకులపతులు మారగా.. ప్రస్తుత వీసీ పద్మరాజు నాలుగో వ్యక్తి. 

నేతల బంధువులకే ప్రాధాన్యం..

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత నన్నయ వర్సిటీకి ఉపకులపతిగా అవకాశం దక్కించుకున్న పద్మరాజు..తమది రాజకీయ కుటుంబమంటూ చెప్పేవారు. అప్పటి రాజానగరం ఎమ్మెల్యే రాజాతోపాటు తాడేపల్లిగూడెం, కాకినాడ వైకాపా నేతలు సూచించిన 25 మందికి అర్హతలు పక్కనపెట్టి బోధన, బోధనేతర విభాగాల్లో ఉద్యోగాలు కల్పించారన్న ఆరోపణలున్నాయి. బోధనా సిబ్బంది నుంచి వ్యతిరేకత రాకుండా పదోన్నతులు కల్పించారని.. సొమ్ము చేతులు మారిందన్న విమర్శలు సరేసరి. 15 మందికి అర్హత చూడకుండా ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇవ్వడం చర్చనీయాంశమైంది. వారికి బకాయిల విడుదలకు సంతకాలు చేసినట్లు తెలిసింది. తద్వారా రూ.50 వేల చొప్పున లబ్ధిచేకూరనుంది. సిబ్బంది పర్యవేక్షణ పేరిట విశ్రాంత ఆర్మీ అధికారిని నియమించి నెలకు రూ.56 వేలు చెల్లిస్తున్నారు. మరో సహాయకుడు, డ్రైవర్‌నూ పెట్టారు. ః ఎన్నికలకు ముందు సుమారు 45 మందిని వివిధ కళాశాలల్లో ఒప్పంద విధానంలో నియామకాలు చేశారు.

అక్రమాలపై మంత్రుల దృష్టికి.. 

‘‘నన్నయ వర్సిటీ వైకాపా పాలనలో అక్రమాలకు నిలయంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి బంధువు వీసీగా నియమితులైన తర్వాత మరింత రాజకీయ పెత్తనం పెరిగింది. సిఫార్సులతో అడ్డగోలుగా ఉద్యోగాలిచ్చారు. కీలకమైన ఈసీ కమిటీలోనూ ఆరోపణలున్న వ్యక్తులను సభ్యులుగా నియమించారు. కాంట్రాక్టులు బినామీలతో చేయిస్తున్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌కు విన్నవించా’’మని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు.

కొందరికే సివిల్‌ పనులు..

నన్నయ వర్సిటీలో చేపడుతున్న అనేక నిర్మాణాలు, ఇతర పనులకు సంబంధించి అనుకూల సంస్థకే పనుల బాధ్యత అప్పగిస్తున్నారు. వాటితో కలిసి బినామీ వ్యక్తులు కొన్ని పనులు చేస్తూ జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలున్నాయి.

సభ్యుల నియామకంలోనూ..

వర్సిటీ అభివృద్ధికి కీలకమైన ఈసీ కమిటీలో సభ్యుల నియామకంలోనూ రాజకీయ వాసనే. అవినీతి, ఇతర ఆరోపణలున్నవారికి సైతం ప్రాధాన్యమిచ్చారనే వాదన ఉంది. ఓ సభ్యుడైతే మహిళలపై వేధింపులు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. మరో సభ్యురాలి విద్యార్హతపైనా అనుమానాలే. ఇంకొకరు వైకాపా నాయకుడికి అత్యంత సన్నిహితుడు.

  • ఇటీవల ఒప్పంద విధానంలో నియమించిన ఓ ఉద్యోగి వేతనాన్ని ఒక్కసారిగా రూ.35 వేలు చేయడంతో నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఆందోళన చేపట్టారు. విద్యార్హత ఆధారంగా పెంచామని వీసీ చెప్పగా.. తమకూ అంతకుమించిన అర్హతలు ఉన్నాయని సిబ్బంది వాదించారు. వీసీదే పైచేయి అయింది.
  • వర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల ర్యాటిఫికేషన్‌ ప్రక్రియ గత కొద్దిరోజులుగా జరుగుతోంది. సాధారణంగా ఇక్కడినుంచి ఓ కమిటీ వెళ్లి తనిఖీలు చేసి అనుమతులు మంజూరుచేయాలి. అయితే వర్సిటీకే కళాశాల సిబ్బందిని రప్పించడం గమనార్హం. ఈ ప్రక్రియంతా వీసీకి సన్నిహితుడైన ఓ ప్రొఫెసర్‌కు అప్పగించినట్లు సమాచారం.
  • వీసీ పద్మరాజు సోమవారం తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆదివారం కొంతమంది బోధనా సిబ్బందికి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారన్న అంశం చక్కర్లు కొడుతోంది.

రాజీనామా చేయనున్న జేఎన్‌టీయూకే వీసీ?

గాంధీనగర్‌: కాకినాడలోని జేఎన్‌టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు సోమవారం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఆయన పేరిట సందేశం చక్కర్లు కొడుతుంది. తనకు ఇన్నాళ్లు సహకరించిన ఉద్యోగులు, జేఎన్‌టీయూకే అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అందులో ఉంది. కాగా ఆయన మరో నాలుగు నెలల్లో వీసీగా మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు.

ఈనాడు, రాజమహేంద్రవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు