logo

బియ్యం బొక్కినోళ్లకు వణుకు

గోదాములు, మిల్లుల్లో టన్నులకొద్దీ అక్రమ బియ్యం నిల్వలు.. ఎక్కడికక్కడ చౌక బియ్యం గోనె సంచులు.. పరిసరాల్లో పడేసిన ట్యాగులు..పేదలకు అందాల్సిన సరకును వైకాపా నేతలు తమ అక్రమ ఆర్జనకు ఏరీతిన వాడుకుంటున్నారో శుక్రవారం తేటతెల్లమైంది.

Updated : 29 Jun 2024 05:28 IST

మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలతో అప్రమత్తం
తమవారికి ఉప్పందించిన వైకాపా వీర విధేయులు
అంటకాగుతున్న అధికారులపై మనోహర్‌ ఆగ్రహం
అక్రమ నిల్వలున్న గోదాములు సీజ్‌ చేయాలని ఆదేశం

సమీక్షిస్తున్న మంత్రి నాదెండ్ల.. వేదికపై ఎమ్మెల్యేలు సత్యప్రభ, నానాజీ,
వనమాడి, ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్, కలెక్టర్‌ షాన్‌ మోహన్‌

గోదాములు, మిల్లుల్లో టన్నులకొద్దీ అక్రమ బియ్యం నిల్వలు.. ఎక్కడికక్కడ చౌక బియ్యం గోనె సంచులు.. పరిసరాల్లో పడేసిన ట్యాగులు..పేదలకు అందాల్సిన సరకును వైకాపా నేతలు తమ అక్రమ ఆర్జనకు ఏరీతిన వాడుకుంటున్నారో శుక్రవారం తేటతెల్లమైంది. ఈ వ్యవస్థీకృత మాఫియాను చూసి సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విస్మయం చెందారు.

 ఈనాడు, కాకినాడ

క్షేత్రస్థాయి రేషన్‌ అక్రమాల నిగ్గుతేల్చమని శుక్రవారం ఉదయాన్నే కీలక శాఖలతో కూడిన పది బృందాలను మంత్రి నాదెండ్ల రంగంలోకి దింపారు. లోపాలేమీ లేవని నమ్మించడానికి కొందరు అధికారులు ఆపసోపాలు పడ్డారు. వైకాపాతో అంటకాగుతున్న వీరి తీరు చూసి .. పద్ధతి మార్చుకోకపోతే ఉపేక్షించనని మంత్రి హెచ్చరికలు జారీచేశారు. ద్వారంపూడి అక్రమాల సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నా పేరు పవన్‌ కల్యాణ్‌ కాదంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గతంలో సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. జనసేన ప్రతినిధి పౌరసరఫరాల మంత్రి హోదాలో రేషన్‌ మాఫియా దందాపై దృష్టిసారించడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలయ్యింది. తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూసిన గోదాములు ద్వారంపూడి అనుచరులవేనని చెప్పడం.. పెద్దల పేర్లు త్వరలో వెల్లడిస్తాననడంతో గుబులు రేగింది.

కాకినాడ యాంకరేజ్‌ పోర్టులోని గోదాములో తనిఖీలు

‘చౌక’గా  కొట్టేస్తున్న తీరు

తొలుత కాకినాడ యాంకరేజి పోర్టు పరిధిలోని విశ్వప్రియ ఎక్స్‌పోర్ట్స్, బీచ్‌రోడ్డులోని సార్టెక్స్‌ ఇండియా, మానస ఎక్స్‌పోర్ట్స్, డీఎన్‌ఎస్‌లలో మంత్రి మనోహర్‌ తనిఖీలు చేశారు. విశ్వప్రియ, సార్టెక్స్, లవన్, సరళ ఫుడ్స్‌ తదితర చోట్ల చౌక బియ్యం అక్రమ వ్యవహార ఆనవాళ్లు గుర్తించారు సరళ ఫుడ్స్‌ వద్ద అక్రమాలు లేవని అధికారులు కప్పిపుచ్చినా.. గోదాము వెనక చౌక బియ్యం ట్యాగులు పడి ఉండడాన్ని మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు. బియ్యం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తాయని చెప్పినా..వేబిల్లులు, దస్త్రాలు చూపలేకపోయారు. వైకాపా నేతలు అధికారులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు యత్నించడం చర్చకు దారితీసింది.

కౌలు రైతులకు అన్యాయం చేస్తారా..?

కలెక్టరేట్‌లో కీలకశాఖలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కౌలు రైతులు గణనీయంగా తగ్గినట్లు చూపారని..వైకాపా చేసిన అవినీతిలో అదొకటని వ్యాఖ్యానించారు.వీరు ఒకప్పుడు 79 శాతం మంది ఉంటే.. ఈరోజు చూపించే లెక్క 13 నుంచి 16 శాతం ఉందన్నారు. పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని అన్యాయంగా వారికి దూరంచేశారన్నారు.

కోత పెడితే కేసులే

ధాన్యం గత సీజన్‌లో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని అధికారులు వెల్లడించగా.. ఇప్పుడూ అదే లక్ష్యం నిర్దేశించుకోవాలని..ఆర్‌బీకేలపై పర్యవేక్షణ పెంచాలని మనోహర్‌ అన్నారు.  తేమశాతం పేరుతో రూ.100, రూ. 200 కోత పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు.

సమన్వయ లోపంపై  ఆగ్రహం..

అంగన్‌వాడీలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు నాణ్యమైన సరకు  వెళ్తున్నాయో లేదో తనిఖీ చేస్తున్నారా అని డీటీలను ప్రశ్నిస్తే లేదని చెప్పారు. గోధుమ పిండికి కార్డుదారుల నుంచి డిమాండ్‌ ఉన్నా ఏప్రిల్‌ నుంచి అవసరమైన సరకు కోసం ఎందుకు ఇండెంట్‌ పెట్టలేదని జేసీని ప్రశ్నించారు. చౌక బియ్యం భారీగా తరలిపోతుంటే ఏం చర్యలు తీసుకున్నారని రవాణాశాఖ అధికారిని అడిగారు.

రైతులకు  మేలు చేద్దాం..

పౌరసరఫరాలు, అనుబంధ శాఖలతో మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ షాన్‌ మోహన్, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పౌర సరఫరాల సంస్థ ఎండీ వీర పాండ్యన్, జేసీ హేమసుందర్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి వెంకట కృష్ణ పాల్గొన్నారు.

  • తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ (కాకినాడ ఎంపీ): ధాన్యం కొనుగోళ్లలో రైతులను దోచుకుంటున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేలపై నిఘా పెంచాలి.
  • వనమాడి కొండబాబు(కాకినాడ నగర ఎమ్మెల్యే): గడచిన అయిదేళ్లలో పౌరసరఫరాల అంశంపై ఒక్క సమీక్ష, తనిఖీ లేదు. రేషన్‌ బియ్యంలో అక్రమాలు, రైతు సమస్యలు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు.
  • పంతం నానాజీ(కాకినాడ గ్రామీణం): కాలువలు పూడికపోయి నీరు దిగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని