logo

వర్సిటీలు.. వైకాపా రాజకీయ నిలయాలు

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ...వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాల్లో వైకాపా అయిదేళ్ల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరింది..వారి అడుగులకు మడుగులొత్తినవారికి ఇక్కడ ఉన్నత హోదాలు దక్కాయి.

Updated : 29 Jun 2024 05:30 IST

గత అయిదేళ్లలో నేతల పెత్తనం
ఇష్టారీతిన పార్టీ సదస్సులు

జేఎన్‌టీయూకే

గాంధీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ...వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాల్లో వైకాపా అయిదేళ్ల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరింది..వారి అడుగులకు మడుగులొత్తినవారికి ఇక్కడ ఉన్నత హోదాలు దక్కాయి. వైకాపా నాయకులకు బోర్డులో కమిటీ సభ్యులుగా పదవులు లభించాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను మూసేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. చదువుకున్నా ఉద్యోగాలు లభించక యువత నిరుద్యోగులుగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. తాము అధికారంలోకి రాగానే విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తామని, విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం...తాజాగా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

కాకినాడలో జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూకే), రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం(అక్నూ) ఉన్నాయి. వీసీలుగా జీవీఆర్‌ ప్రసాదరాజు, కె.పద్మరాజు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర ప్రభుత్వంలో 1946లో కాకినాడలో ఇంజినీరింగ్‌ కళాశాలగా ప్రారంభమై, ఏయూ అనుబంధంగా 2008లో జేఎన్‌టీయూకేగా మారింది. ఇక్కడ ఇంజినీరింగ్‌ చదువుకున్నవారిలో అత్యధిక శాతం విదేశాల్లోనూ, ప్రముఖ కంపెనీల్లో ఉన్నతశ్రేణి ఉద్యోగులుగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్సిటీని వైకాపా నాయకులు భ్రష్టుపట్టించారు.

జేఎన్‌టీయూ : జగనన్న కాలేజ్‌ కెప్టెన్స్‌ కార్యక్రమంలో విద్యార్థులు (పాతచిత్రం)

ప్రక్షాళన దిశగా.....

వైకాపా హయాంలో రాజకీయ అండదండలతో ఉపకులపతులుగా నియమితులైన పలువురు ఇప్పటికే రాజీనామా చేశారు. జేఎన్‌టీయూకే, అక్నూ వీసీలనూ మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖాధికారులు చర్యలు ఆరంభించారు.యూనివర్సిటీలను స్కిల్‌ హబ్‌లుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. గతంలో మాదిరి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

జగన్‌కు జై కొట్టించి...

తెదేపా అధికారంలో ఉన్న 2014-19 కాలంలో జేఎన్‌టీయూకే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. వైకాపా వచ్చాక శీతకన్ను వేసింది. తమ అనుయాయులను వివిధ విభాగాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా, పాలకవర్గంలో సభ్యులుగా నియమించారు.

  •  కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన చలమలశెట్టి సునీల్‌ పుట్టినరోజు వేడుకలు ఈ ఏడాది మార్చి 4న జేఎన్‌టీయూ ఎదురుగా నిర్వహించారు. అక్కడే వేదిక ఏర్పాటుచేసి హోర్డింగ్‌లతో హంగామా చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోనే వాహనాల పార్కింగ్, మైకుల హడావుడితో విద్యార్థులకు అసౌకర్యం కలిగించారు.
  • జేఎన్‌టీయూ సెనేట్‌ హాలులో ఈ ఏడాది జనవరి 30న వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘జగనన్న కాలేజ్‌ కెప్టెన్స్‌’ పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ చిత్రంతో ఉన్న టీషర్టులను విద్యార్థులతో ధరింపజేసి జైకొట్టించారు. వైకాపా ప్రచారం కోసం ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలు పంచిపెట్టారు. రాజకీయ ప్రసంగాలు చేసి ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. అప్పటి గ్రామీణ ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్‌ చేసి సదస్సుకోసం హాలు కావాలని అడగడంతో ఇవ్వాల్సి వచ్చిందని.. వైకాపా విద్యార్థి విభాగ సదస్సు నిర్వహించారని తనకు తెలియదని వీసీ చెప్పుకొచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని