logo

యాప్‌ ఊడ్చేసింది

ఎన్ని ఆన్‌లైన్‌ మోసాలు వెలుగుచూస్తున్నా ఇంకా కొన్ని యాప్‌లలో పెట్టుబడి పెట్టి పలువురు నిండా మునిగిపోతున్నారు.

Published : 29 Jun 2024 05:14 IST

ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించిన బాధితులు

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట జీఎంఆర్‌ యాప్‌ బాధితులు 

ద్రాక్షారామ, న్యూస్‌టుడే : ఎన్ని ఆన్‌లైన్‌ మోసాలు వెలుగుచూస్తున్నా ఇంకా కొన్ని యాప్‌లలో పెట్టుబడి పెట్టి పలువురు నిండా మునిగిపోతున్నారు. తాజాగా జీఎంఆర్‌ అనే ఆన్‌లైన్‌ యాప్‌ను నమ్మి రూ.లక్షల్లో పోగొట్టుకున్నామంటూ బాధితులు శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ద్రాక్షారామ పరిసరాలతోపాటు అంబాజీపేట, అమలాపురం, తణుకు తదితర ప్రాంతాలవారు ఉన్నారు. తమలాంటి బాధితులు వెయ్యి మంది వరకు ఉన్నారని పేర్కొన్నారు. తామందరికీ యాప్‌లను పరిచయం చేసిన బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్‌కుమార్, మోటుపల్లి కిరణ్‌కుమార్‌లను వారు పోలీసులకు అప్పగించారు.

ఎలా మోసపోయారంటే..

జీఎంఆర్‌ పథకంలో తొలుత చేరిన వ్యక్తి ఇద్దరిని చేర్చాలని, ఆ వ్యక్తి యాప్‌ లింక్‌ను మిగతా ఇద్దరికి పంపిస్తాడని చెప్పేవారు. అలా చరవాణికి వచ్చిన లింకును తెరచి దాని ద్వారా రూ.4,500, 15,800, 30వేలు, 60వేలు, 1.20లక్షలు ఇలా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చని, రోజూ ఆదాయం వస్తుందని నమ్మించేవారు. ఉదాహరణకు రూ.15,800 పెడితే రోజుకు రూ.500 చొప్పున మన ఐడీకి జమ అవుతాయని చెప్పేవారు. అలా జమ అయిన సొమ్ము రూ.5 వేలు పూర్తయ్యాక కేవలం వారానికి ఒకసారి శుక్రవారం రోజున విత్‌డ్రా చేసుకోవచ్చని సూచించారు.లక్షల్లో పెడితే వేలల్లో ఆదాయం వస్తుంది. ఇలా కట్టిన వారికి మొదట్లో డబ్బులు వచ్చేవి. ప్రస్తుతం బాధితులందరికీ సొమ్ము యాప్‌లో జమ అవుతుంది గాని నాలుగు వారాల నుంచి విత్‌డ్రా కావడం లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించారు. ఇటీవలే డబ్బులు రావడానికి జీఎస్టీ చెల్లించాలంటే అది కూడా కట్టామని వీరు తెలిపారు. బాధితులు పూర్తి వివరంగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఎస్సై సురేంద్ర తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని