logo

చివరి లబ్ధిదారు వరకు ప్రభుత్వ పథకాలు

 ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కొత్త కలెక్టర్‌ పి.ప్రశాంతి చెప్పారు.

Published : 29 Jun 2024 05:11 IST

కొత్త కలెక్టర్‌ ప్రశాంతి

బాధ్యతలు స్వీకరిస్తూ..

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కొత్త కలెక్టర్‌ పి.ప్రశాంతి చెప్పారు. ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వేగవంతంగా ప్రజలకు చేరవేస్తామన్నారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జిల్లాలో పనిచేయడం ఒక మంచి అవకాశమన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారి కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేలా అందరినీ సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తామన్నారు. 

‘ఇ-ఆఫీస్‌’లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు

జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు ‘ఇ-ఆఫీస్‌’ ద్వారా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాలు, వాటి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలుకు అధికారులంతా సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జేసీ తేజ్‌భరత్, డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

కాలానుగుణ వ్యాధుల నివారణకు కార్యాచరణ

సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. డివిజన్, మున్సిపల్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డయేరియా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయం చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. తాగునీటిని సరఫరా చేసే ప్రదేశాల్లో నీటి నమూనా పరీక్షలు నిర్వహించి ఆ మేరకు ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో రక్షిత నీటి ట్యాంకుల నిర్వహణ వ్యవస్థపై స్వయంగా తనిఖీలు నిర్వహించి రెండు, మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు, ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పింఛన్ల పంపిణీలో ఆటంకాలు లేకుండా చూడాలి

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 1వ తేదీన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంలో ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 9,552 క్లస్టర్‌ పరిధిలో 2,44,302 మంది లబ్ధిదారులకు రూ.163.13 కోట్ల మేర పంపిణీ చేయాల్సి ఉందని, ఆయా క్లస్టర్ల వారీగా సీఎఫ్‌ఎంఎస్‌ గుర్తింపు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులతో మ్యాపింగ్‌ ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని