logo

జీజీహెచ్‌కు విద్యుత్తు బిల్లుల షాక్‌

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి విద్యుత్తు షాక్‌ తగిలింది. ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ, డయాలసిస్‌ సేవలందిస్తున్న ప్రైవేటు సంస్థలు మూడేళ్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు తాజాగా వెలుగుచూసింది.

Published : 29 Jun 2024 05:10 IST

కొన్నేళ్లుగా చెల్లించని ప్రైవేటు సంస్థలు
రూ.4 కోట్ల వరకు సర్వజన ఆసుపత్రిపై భారం
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి విద్యుత్తు షాక్‌ తగిలింది. ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ, డయాలసిస్‌ సేవలందిస్తున్న ప్రైవేటు సంస్థలు మూడేళ్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు తాజాగా వెలుగుచూసింది. దీంతో జీజీహెచ్‌పై బకాయి బండ పడింది. దీనిపై ఆసుపత్రి అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు.

రాజమహేంద్రవరం వైద్యశాలలో పీపీపీ పద్ధతిలో డయాలసిస్‌ కేంద్రాన్ని 2016లో ఓ సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు వీరు బిల్లులు చెల్లించినా తరువాత ఆపేశారు. వీటికి ప్రతి నెలా సుమారు రూ.80-90 వేలు విద్యుత్తు బిల్లు వస్తుంది. మూడు, నాలుగేళ్ల నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో పేరుకుపోయిందని ఆసుపత్రి వర్గాల అంచనా. మూడేళ్ల కిందట ఓ ప్రైవేటు సంస్థతో జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. అప్పటి ఆసుపత్రి అధికారులు కనీసం దానికి విద్యుత్తు మీటరు సైతం ఏర్పాటు చేయకపోగా.. సంస్థ ప్రతినిధులు సైతం బిల్లు చర్చ లేకుండానే ఇప్పటివరకు విద్యుత్తు వినియోగించుకున్నారు. కొద్ది రోజుల క్రితం సూపరింటెండెంట్‌ సమీక్షలో ఈ రెండు సంస్థలు బిల్లులు చెల్లించడం లేదని గుర్తించారు. వెంటనే వారికి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం జీజీహెచ్‌ నుంచి ఏపీఈపీడీసీఎల్‌కు సుమారు రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు సమాచారం. ఈ రెండు సంస్థలు బిల్లులు చెల్లిస్తేనే జీజీహెచ్‌పై భారం తప్పుతుంది.

బకాయిలు చెల్లించేలా చర్యలు

గతంలో జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు డయాలసిస్, ఎంఆర్‌ఐ చేసే సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి. సమీక్ష చేసి బిల్లుల బకాయిలు ఉన్నట్లు గుర్తించా. వెంటనే వారికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించాం. వారితోనే బిల్లుల బకాయిలు చెల్లించేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఒక సంస్థ చెల్లించేందుకు అంగీకరించింది. మరో సంస్థ ప్రతినిధులతో చర్చించి వారు వినియోగించిన బిల్లుల బకాయి మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.

డాక్టర్‌ ఎం.లక్ష్మీ సూర్యప్రభ, సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం జీజీహెచ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని