logo

రుణ ప్రణాళిక @ 14,258.51 కోట్లు

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) జిల్లాకు వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది.

Published : 29 Jun 2024 05:01 IST

రుణ ప్రణాళిక జీ 14,258.51 కోట్లు
న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాత

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) జిల్లాకు వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది. దీనిలో భాగంగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ప్రాధాన్య, అప్రాధాన్య, ఇతర రంగాలకు కలిపి మొత్తంగా రూ.14,258 కోట్లతో నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న సాగు విస్తీర్ణం ఆధారంగా బ్యాంకర్లు రుణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. వ్యవసాయ రంగానికి బ్యాంకుల వారీగా ఏ మేరకు పంట రుణాలివ్వాలనేది దీనిలో కేటాయిస్తారు. ఆ ప్రకారం బ్యాంకులు అన్నదాతలకు సాగుకు అవసరమైన పెట్టుబడి రుణాలు మంజూరు చేస్తాయి. ఎన్నికల నియమావళి కారణంగా ప్రస్తుత సీజన్‌కు ఈ ప్రక్రియ రెండు నెలలపాటు ఆలస్యమైంది.

రంగాల వారీగా ఖరారు..

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ఆధారంగా వాటికి రుణాల మంజూరును నిర్ణయిస్తారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు రుణ పరిమితి నిర్ణయించారు. దీనిలో వ్యవసాయ రంగానికి రూ.9190.51 కోట్లతో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రూ.600 కోట్లు కేటాయించారు. వీటితోపాటు విద్య, గృహ నిర్మాణాలు, ఇతర రుణాలు కూడా మంజూరు చేయాలని నిర్ణయించారు. వార్షిక రుణ ప్రణాళిక ఖరారైనా, జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించాల్సిఉంది.

లక్ష్య నిర్దేశం ఇలా..

ఖరీఫ్, రబీ సీజన్‌లలో సాగు అవసరాలకు అనుగుణంగా రుణాలకోసం రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తారు. ఏటా వీరితోపాటు మిగిలిన రంగాలకు రుణ పరిమితి ఎంత కేటాయించాలో నాబార్డు స్పష్టం చేస్తుంది. జిల్లాలో సాగు విస్తీర్ణం, రైతులు, బ్యాంకుల సంఖ్య, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని పంట రుణాలు కేటాయిస్తారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట..

రుణాల మంజూరులో వ్యవసాయ రంగానికి మొదట ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యాన పంటలు, పాడి పరిశ్రమ, ఆధునిక సాంకేతిక వ్యవసాయ పరికరాల కొనుగోలు, బోర్లు, మోటార్లకు రుణాలు మంజూరు చేస్తారు. పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం, ఎరువుల తయారీ, విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమలకు, నిరుద్యోగులకు, మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందేందుకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా రుణ ప్రణాళికలో ప్రాధాన్యం ఉంటుంది.

ప్రైవేటు బ్యాంకులపై అసంతృప్తి

రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చినా అన్నదాతల అవసరాల మేరకు రుణాలు మంజూరు కాక అధిక శాతం మంది పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి రైతులకు కలుగుతోంది. ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఆ రుణాలు తీర్చేందుకు తిప్పలు పడాల్సిందే. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా రుణాల మంజూరుకు ప్రైవేటు బ్యాంకులు సహకరించడం లేదని బ్యాంకర్ల సమావేశంలో పలుమార్లు కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గడిచిన అయిదేళ్లుగా అనేక మంది రైతులకు రుణాల మంజూరులో మొండిచేయే ఎదురైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుండడంతో ఈ సారి తమకు రుణ బాధలు ఉండవనే అభిప్రాయం అన్నదాతల నుంచి వ్యక్తం అవుతోంది.

ఇవీ ప్రాధాన్య రంగాలు

విద్యార్థుల ఉన్నత చదువులకు రూ.7.50 లక్షల్లోపు, వ్యవసాయ రంగంలో రూ.3 లక్షల్లోపు, చిరువ్యాపారులకు రూ.35 వేలలోపు ఇచ్చే రుణాలన్నీ ప్రాధాన్యరంగంలోకే వస్తాయి. ఈ మొత్తం దాటితే అప్రాధాన్య రంగానికి మంజూరుచేసిన రుణంగా పరిగణిస్తారు. వీటికి అనుగుణంగానే ఈ రెండు రంగాలకు అనువుగా రుణ ప్రణాళిక ఖరారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని