logo

త్వరలో విద్యుత్తు బస్సులు..

కాకినాడ జిల్లాలో త్వరలో  ఆర్టీసీ విద్యుత్తు బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 04:55 IST

జిల్లాకు 50 కావాలని ప్రతిపాదనలు
ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు

డీపీటీవో ఎం.శ్రీనివాసరావు

సాంబమూర్తినగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలో త్వరలో  ఆర్టీసీ విద్యుత్తు బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాలుష్య రహిత బస్సులతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు  కల్పిస్తామని చెప్పారు. స్మార్ట్‌సిటీలో స్మార్ట్‌ బస్సులు రోడ్డెక్కుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే తిరుపతిలో వీటిని విజయవంతంగా తిప్పుతున్నారు. జిల్లాకు  50 ఎలక్ట్రికల్‌ బస్సులు కావాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రజా రవాణాకు సంబంధించిన పలు అంశాలపై ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

కాకినాడ ఆర్టీసీ బస్టాండు

హైదరాబాద్‌కు నాన్‌ ఏసీ స్లీపర్‌..

ఎన్నికలకు ముందు ప్రభుత్వం జిల్లాకు 23 కొత్త బస్సులు కేటాయించింది. ఇప్పటికే 8 సూపర్‌ లగ్జరీ బస్సులు డిపోకు చేరుకున్నాయి. వీటిని కాకినాడ-విజయవాడ మార్గంలో నడుపుతున్నాం. త్వరలో మిగిలిన బస్సులు అందుబాటులోకి వస్తాయి. మరో నాలుగు స్టార్‌లైనర్‌ (నాన్‌ ఏసీ స్లీపర్‌) బస్సులు రానున్నాయి. వీటిని తుని-హైదరాబాద్‌ రూటులో 2, కాకినాడ-హైదరాబాద్‌ మార్గంలో 2 చొప్పున తిప్పనున్నాం. పాత సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సులకు పల్లెవెలుగు బాడీ కట్టి 2025 మార్చిలోగా అందుబాటులో తెస్తాం.

అధునాతన బస్‌షెల్టర్లు..

స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలో పద్మప్రియ, జడ్పీ కూడలి, జగన్నాథపురం బ్రిడ్జి, అన్నమ్మ ఘాటీ ప్రాంతాల్లో అధునాతన బస్‌షెలర్ల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అధికారులకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే అధికారులతో కలిసి ఈ విషయమై చర్చిస్తాం. బస్టాండ్లలో పోలీసు శాఖ సహకారంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. రాత్రిపూట గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. బస్సులు, బస్టాండ్లలో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, ఇతర కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా కొనసాగుతోంది.

డ్రైవర్లకు అవగాహన..

డిపోల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించి సూచనలు చేస్తున్నాం. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్యారేజీల్లో బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే రోడ్డెక్కిస్తున్నాం. డ్రైవర్ల నియామకంపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాం.

జిల్లా పరిధిలో తుని, ఏలేశ్వరం, కాకినాడ ఆర్టీసీ డిపోల నుంచి పల్లెవెలుగు, విద్యార్థులకు బడిబస్సులు తిప్పుతున్నాం. రోజూ 288 బస్సులు 1.12 లక్షల కి.మీ. తిరుగుతూ 82 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. రోజూ దాదాపు రూ.50 లక్షల మేర ఆదాయం వస్తోంది. కాకినాడ డిపో నుంచి ఇంద్ర, గరుడ, వెన్నెల, అమరావతి, నైట్రైడర్స్‌ తదితర ఏసీ బస్సుల ద్వారా మెరుగైన సేవలందిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని