logo

Kakinada: జనానికి మండింది.. జగన్‌ పేరు ఊడింది

‘మా ఊరు పోలవరం.. మా గ్రామానికి వెళ్లే మార్గంలో భారీ ఆర్చి కట్టి ‘జగన్మోహనపురం’ అని పేరు రాశారు. ఇన్నాళ్లూ అభ్యంతరం చెబితే వైకాపా వారు బెదిరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది.

Updated : 26 Jun 2024 07:53 IST

జగన్మోహనపురం పేరు తొలగించి 
జనసేన జెండా ఎగరేసిన యువత 

జగన్‌ పేరుతో ఏర్పాటుచేసిన అక్షరాలను తొలగించి.. జనసేన జెండా ఎగరవేస్తున్న యువకులు

ఈనాడు, కాకినాడ: ‘మా ఊరు పోలవరం.. మా గ్రామానికి వెళ్లే మార్గంలో భారీ ఆర్చి కట్టి ‘జగన్మోహనపురం’ అని పేరు రాశారు. ఇన్నాళ్లూ అభ్యంతరం చెబితే వైకాపా వారు బెదిరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. నిగ్గదీసే ధైర్యం వచ్చింది’ అంటూ కొందరు యువత సంఘటితమై ఆర్చి ఎక్కి జగన్‌ చిత్రాలు తొలగించారు.. కాకినాడ గ్రామీణ మండలం పోలవరంలో ఇది చోటుచేసుకుంది. తమ్మవరం పంచాయతీలోని పోలవరం గ్రామానికి వెళ్లే మార్గంలో ఓ పక్కన నేమాం లేఅవుట్‌ (జగనన్న కాలనీ) ఉంది. వైకాపా ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో ఆర్చిలు, పైలాన్లతో హడావుడి చేసిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్‌ 25న యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్‌లో రాష్ట్రవ్యాప్త ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అప్పటి సీఎం జగన్‌ను ఆకర్షించేందుకు మార్గమధ్యలోని ఈ పోలవరం గ్రామం వద్ద భారీ ఆర్చి నిర్మించారు. దానికి జగన్మోహనపురం పేరుపెట్టి రెండువైపులా జగన్‌ చిత్రాలు పెట్టారు. ఊరు పోలవరం అయితే జగన్‌ పేరు పెట్టారేంటని ప్రశ్నించినా వైకాపా నాయకులు లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న కొందరు యువత ఆర్చి ఎక్కి పేర్లు పీకేసి తమ నిరసన తెలిపారు. అక్కడ జనసేన జెండా ఎగరవేశారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టాం.. ఇక తగ్గమని తేల్చిచెప్పేశారు. ప్రశ్నించినవారికి ..‘నేమాం కాలనీ దగ్గర ఆర్చి కట్టుకుని పేరు పెట్టుకోండి.. మా ఊరికి జగన్‌ పేరేంటి.’. అని సమాధానం ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని