logo

Andhra news: ఉద్యోగం కాదు.. వైకాపాకు ఊడిగం చేశారు!

ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులు చట్టబద్ధంగా పనిచేయాలి. అధికార పక్షం, విపక్షం అన్న వివక్ష చూపకుండా సమానంగా చూడాలి.

Updated : 28 Jun 2024 09:34 IST

ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు అధికారులు 

ఈనాడు, చిత్తూరు: ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులు చట్టబద్ధంగా పనిచేయాలి. అధికార పక్షం, విపక్షం అన్న వివక్ష చూపకుండా సమానంగా చూడాలి. ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా సమగ్రంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. అంతేకాని ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. అధికార పార్టీకి కొమ్ముకాయకూడదు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఈ ప్రాథమిక సూత్రాన్ని కొందరు అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరించి అపఖ్యాతి మూటగట్టుకున్నారు. 

పెద్దిరెడ్డికి నమ్మినబంటు నరసింహప్రసాద్‌రెడ్డి  

పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌రెడ్డి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నమ్మినబంటులా వ్యవహరించారు. ఆయనకు అనుకూలంగా ఉండటంతోనే కొంతకాలం కుప్పం మున్సిపాలిటీకి ఇన్‌ఛార్జి బాధ్యతలూ అప్పగించారు. పుంగనూరు పట్టణం వివేకానందనగర్‌లో తెదేపా కార్యాలయానికి జయచంద్ర నాయుడు అనే వ్యక్తి భవనాన్ని అద్దెకు ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. యజమానిపై ఒత్తిడి తెచ్చి తెదేపా కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. ఎన్నికల సమయంలో  వైకాపాకు అనుకూలంగా పనిచేయాలని వాలంటీర్లను ఆదేశించారు.  ప్రతిపక్ష ఫ్లెక్సీలకు అనుమతి ఇవ్వకుండా ఏకపక్షంగా పనిచేశారు.  

ఏకగ్రీవానికి సహకరించిన చిట్టిబాబు 

2021 నవంబరులో కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. పురపాలికలోని 25 వార్డులనూ ఏకగ్రీవం చేసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహô రచించారు. నవంబరు 8న నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగా సాయంత్రం 4 - 5 గంటలలోపు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించాల్సింది. రాత్రి ఎనిమిది దాటినా జాబితాను అప్పటి కమిషనర్‌ చిట్టిబాబు విడుదల చేయలేదు. తెదేపా నాయకులు అమరనాథరెడ్డి, నిమ్మల రామానాయుడు ఆందోళనకు దిగగా 14వ వార్డులో వైకాపా అభ్యర్థి మునుస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చిట్టిబాబు ప్రకటించారు. తెదేపా తరఫున నామినేషన్‌ వేసిన ప్రకాష్‌.. ఉపసంహరించుకోకున్నా నామపత్రాన్ని వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారు. 

 అడ్డగోలుగా ఉద్యోగాలిచ్చిన సుబ్రహ్మణ్యం

కుప్పంలోని గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో) ఎండీగా విధులు నిర్వహించిన సుబ్రహ్మణ్యం ఇష్టారాజ్యంగా నియామకాలకు తెరలేపారు. డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఉద్యోగోన్నతులు కల్పించేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విద్యుత్తు నియంత్రికల కొనుగోళ్లనూ అక్రమాలు చేశారు. ఛైర్మన్‌ సెంథిల్‌ అండదండలతో భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని గతంలో తెదేపా నాయకులు విమర్శించారు. 

బూతులతో విరుచుకుపడ్డ శివకుమార్‌  

తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినప్పుడు తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపితే కుప్పం ఎస్సైగా పనిచేసిన శివకుమార్‌ కేసులు నమోదు చేశారు. ఏప్రిల్‌ 19న కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటనకు వెళ్లారని రామకుప్పం మండలం కావలిమడుగుకు చెందిన ఎస్టీలపై ఆయన బూతులతో విరుచుకుపడ్డారు. తెదేపా కార్యకర్తల ఇళ్లలో నాటు తుపాకులున్నాయని బెదిరించారు. కూలి పనులు చేసుకునే మీకెందుకు రా రాజకీయాలు అంటూ హెచ్చరించారు. వైకాపా నేతల ప్రోద్బలంతోనే శివకుమార్‌ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈయన వీఆర్‌లో ఉన్నారు.

కావాల్సిన వ్యక్తుల కోసమే నోటిఫికేషన్‌ ఇచ్చిన శ్రీహరి  

గత ప్రభుత్వంలో డాక్టర్‌ శ్రీహరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)గా వ్యవహరించారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాపకంతోనే ఆయన పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్‌ ఇవ్వగా పెద్దిరెడ్డి చెప్పిన వ్యక్తులకే ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం ఏకంగా ఐదుసార్లు నోటిఫికేషన్‌ రద్దు చేశారంటే వైకాపాకు ఎంతలా అంటకాగారో అర్థమవుతోంది. ఆయన మూలంగా డీడీలు చెల్లించిన వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారు. ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడంలోనూ చేతివాటం చూపారనే విమర్శలున్నాయి. మామూళ్లు వసూలు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆ శాఖ వర్గాలే అంటున్నాయి. ప్రస్తుతం మరోసారి జిల్లాకు వచ్చేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని