logo

రుచీపచి లేని బడి భోజనం

మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్‌ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది.

Published : 05 Jul 2024 03:22 IST

పాఠశాల బయటికెళ్లి ఫాస్ట్‌ఫుడ్‌ తింటున్న విద్యార్థులు

ప్రశ్నార్థకంగా నాణ్యత.. ఆసక్తి చూపని వైనం

నాయుడుపేటలో ఓ బడి సమీపంలో ఫ్రైడ్‌ రైస్‌ దుకాణం వద్ద విద్యార్థులు

తిరుపతి (బైరాగిపట్టెడ), గూడూరు, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్‌ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. కొన్ని చోట్ల హాజరు వేసుకుని ఇళ్లకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో ఏకంగా నూడిల్స్, ఫ్రైడ్‌ రైస్‌ తీసుకునే పరిస్థితులు దాపురించాయి. కొత్త ప్రభుత్వం నాణ్యతపై ఆరా తీస్తోంది. వచ్చిన ఫిర్యాదులతో హాజరు పరిశీలన, తాఖీదులివ్వడంపై దృష్టి పెట్టింది. హాజరు నమోదు చేయించుకుంటున్న బడుల్లో పిల్లలు ఇళ్లకు వెళ్తున్నట్లు బయటపడుతోంది. వైకాపా ప్రభుత్వం 2022లో నామమాత్రంగానే మధ్యాహ్న భోజన నిర్వహణ ధరలు పెంచింది. ఏజెన్సీలు మార్చడంపై ఉన్న శ్రద్ధ పిల్లలకు భోజనం పెట్టించడంలో లేకపోవడం గమనార్హం.

నిర్వహణ అంతంతమాత్రమే.. చాలాచోట్ల వంటగదులకు దిక్కులేదు. స్టోరేజి వసతులు మృగ్యంగా మారాయి. కూర్చుని తినే వసతులు అంతంతమాత్రమే కాగా నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. పెళ్లకూరు మండలం నెలబల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వంటగది పూర్తి కాలేదు. వంట తయారీ కష్టంగా మారుతోంది. తాళ్వాయపాడు జడ్పీలో బడి గది ఆనుకుని వంట తయారు చేస్తున్నారు. నాడు-నేడు కింద నిర్మించిన గదులకు నీరు, విద్యుత్‌ సదుపాయాల్లేని పరిస్థితి చాలా చోట్ల ఉంది. 

ఇవీ సమస్యలు..  అన్నం ఉడికీ ఉడకనట్లు.. కొన్ని చోట్ల మెత్తగా ఉండటం.. తగిన మోతాదులో ఆకు కూరలు, కూరగాయలు కలపకపోవడం.. పప్పు ఉడకకపోవడం.. తగ్గించి తయారు చేయడం వంటివి  గుర్తించారు. ఇలా విద్యార్థులు రుచి లేకపోవడంతో నాయుడుపేట బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మధ్యాహ్నం సమీపంలోని నూడిల్స్‌ దుకాణంలో చిరుతిళ్లు తింటున్నారు.
గైర్హాజరుపై ఆరా.. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యార్థుల హాజరుపైనా ఆరా తీస్తోంది. ఎక్కడెక్కడ విద్యార్థులు బడులకు దూరమవుతున్నారు. ఆయా పాఠశాలల్లో భోజనం తయారీ వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలకు తయారీ ఇంటి వద్దే ఉంటోంది. ఇక్కడ వండి తెస్తున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి.

పేరు మార్చి.. ఏమార్చి

పీఎం పోషణ్‌  కింద కేంద్రం నిధులు ఇస్తోంది. ఆహార ధాన్యాలతోపాటు కూరగాయలు, ఆకు కూరలు, పప్పులకు నిధులు వెచ్చిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం మాత్రం జగనన్న గోరుముద్దగా పేరు మార్చి ముద్ద దిగని పరిస్థితి తీసుకొచ్చింది. ధరలు పెరగడంతో టమాటా, వంకాయ వంటివి సాంబారులో వేయడం మానేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు