logo

పెరగని సీట్లు..తరగని డిమాండు

తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది

Published : 05 Jul 2024 02:50 IST

తితిదే కళాశాలలో ప్రవేశాలకు అష్టకష్టాలు 

పాలకులు స్పందించాలంటున్న తల్లిదండ్రులు 

శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాల  
మహిళా వర్సిటీ (తిరుపతి): తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. పది పూర్తవగానే అధికశాతం శ్రీపద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలను ఎంచుకుంటున్నారు. పదేళ్లుగా కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థినులతో సమానంగా, వారికంటే ఎక్కువగా మార్కులు సాధిస్తున్నారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకులు పొందుతున్నారు. 

విన్నవించినా ఫలితం శూన్యం

కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని వైకాపా ప్రభుత్వంలోని తితిదే అధికారులకు కళాశాల అధికారులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు విన్నవించినా ఎలాంటి ఫలితం లభించలేదు. నూతన ఈవోగా నియమితులైన శ్యామలరావుకు విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు, పలువురు రాజకీయ నాయకులు ఇదే విషయమై విన్నవించారు.  

నిరాశతో వెనుదిరిగి..

చిత్తూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల విద్యార్థులు ప్రవేశాలపై ఆసక్తి చూపుతున్నారు. మంగళవారంతో స్పాట్‌ ప్రవేశాలు ముగియగా పరిమిత సీట్లు ఉండటంతో మంచి మార్కులు సాధించినప్పటికీ సీటు లభించక ఎంతోమంది విద్యార్థినులు నిరాశతో వెనుదిరిగారు.

ఎనిమిదేళ్లుగా ఇంతే..

కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, సీఈఎల్‌ కోర్సులను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రథమ సంవత్సరంలో 968 సీట్లు ఉండగా ఈ సంఖ్య ఎనిమిదేళ్లుగా పెంచకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.]

వసతిగృహంలో ఇదే ఇబ్బంది

కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో మొత్తం 1936 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ప్రథమ సంత్సరం నుంచి 450, ద్వితీయ సంవత్సరం నుంచి 450 మంది విద్యార్థినులు కలిపి మొత్తం 900 మంది విద్యార్థినులకు మాత్రమే వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మిగిలిన వారు బయట ప్రైవేటు వసతి గృహాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో భద్రత కొరవడి విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం రెండువేలమందికి వసతి కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నారు. 

ప్రభుత్వ కళాశాల ఏదీ?

విద్యాకేంద్రంగా భాసిల్లుతున్న తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్‌ కళాశాలలు తప్పితే ఇప్పటివరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేదు. ఈ కళాశాలల్లో పరిమిత సీట్లు ఉండటంతో అప్పులు చేసి ప్రైవేటు కళాశాలల్లో చేర్చుతున్నారు. పద్మావతి జూనియర్‌ కళాశాలలో సైన్స్‌ గ్రూపుకు రూ.4900, ఆర్ట్స్‌ గ్రూపుకు రూ.3970, హాస్టల్‌కు రూ.3025 చెల్లిస్తే చాలు. ప్రైవేటు కళాశాలల ఫీజులతో పోల్చితే ఈ ఫీజు చాలా తక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తితిదే కళాశాలలో సీటువస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. ఉన్నతాధికారులు అధికారులు స్పందించి సీట్ల సంఖ్యను పెంచితే బాగుంటుందని కోరుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని