logo

సాహసమే శ్వాసగా

 ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు..

Published : 05 Jul 2024 02:45 IST

 నిరంతర సాధనతో ముందుకు

జాతీయ స్థాయి గుర్తింపు కోసం సన్నద్ధత

ఎన్‌సీసీ శిక్షణలో కేడెట్లు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. చిత్తూరులోని పోలీసు శిక్షణ కేంద్రంలో 35వ ఆంధ్రా బెటాలియన్‌ నేతృత్వంలో జరిగిన వార్షిక శిబిరంలో ప్రతిభ కనబరచిన కేడెట్లు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.. థలసైనిక్‌ క్యాంప్‌ ఎంపికకు తిరుపతిలో జరిగే యాన్యువల్‌ కంబైన్డ్‌ ట్రైనింగ్‌ శిబిరానికి అర్హత పొందారు. అక్కడా రాణించి.. జాతీయ స్థాయికి వెళ్తామని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సాధన ఇలా.. 

ఎన్‌సీసీ క్యాంప్‌లో డ్రిల్, రైఫిల్‌ షూటింగ్, మ్యాప్‌ రీడింగ్, టెంట్లు స్వతహాగా ఏర్పాటు చేయడం/తొలగించడం, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై సాధన చేశారు. శారీరక దృఢత్వం కోసం వ్యాయామం.. ఆటలు, ఆరోగ్యం, సంస్కృతి, దేశభక్తి, దేశ రక్షణ, సాంస్కృతిక అంశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇంకా టీం వర్క్‌ ద్వారా ఐకమత్యంతో పనిని కచ్ఛితత్వంతో పూర్తిచేయడంలో ప్రావీణ్యం కనబరిచారు.

ఆర్మీ అధికారినవుతా..

పలమనేరుకు చెందిన విష్ణు ఇంజినీరింగ్‌ కోర్సు చదువుతున్నాడు. ఆర్మీలో సేవ చేయాలన్నది అతడి లక్ష్యం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎన్‌సీసీలో చేరిన ఈ యువకుడు.. డ్రిల్, రైఫిల్‌ షూటింగ్, మ్యాప్‌ రీడింగ్, అబ్‌స్టాకిల్స్‌ అంశాల్లో నైపుణ్యం కనబరిచి ఎస్పీ మణికంఠ చేతుల మీదుగా ఇటీవల పతకాన్ని అందుకున్నాడు. థలసైనిక్‌ శిబిరానికి తప్పక ఎంపికవుతానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.

సమయపాలన, కచ్చితత్వం అలవడింది..

పార్థసారథి కుప్పం ద్రావిడ వర్సిటీలో డిగ్రీ చదువుతున్నాడు. బాల్యం నుంచి ఎన్‌సీసీ శిక్షణకు క్రమం తప్పక వస్తున్నాడు. రెగ్యులర్‌ సాధనలో ప్రావీణ్యం కనబరిచి.. టీమ్‌ లీడర్‌గా ఎంపికయ్యాడు. సమయ పాలన పాటిస్తూ.. కచ్చితత్వంతో మంచి ఫలితాల్ని సాధిస్తూ సత్తా చాటాడు. శిక్షణ ద్వారా సమయపాలన అలవడిందని, సమాజ సేవ కోసం పనిచేస్తానని ఈ యువకుడు పేర్కొన్నాడు.

పోలీస్‌ అధికారిగా సేవలందిస్తా..

హేమ.. కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. ఎన్‌సీసీ శిక్షణ ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంచుకుంది. డ్రిల్, ట్రెక్కింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చక్కటి ప్రతిభ కనబరచింది. థలసైనిక్‌ శిబిరానికి ఎంపికవుతానని ధీమా వ్యక్తం చేసింది. పోలీస్‌ అధికారిగా సేవలందిస్తానని అంటోంది హేమ. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు