స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది

వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు

Updated : 05 Jul 2024 06:05 IST

రెస్కోలో అక్రమాలపై ముమ్మర విచారణ
అసమర్థ ఉద్యోగులను గుర్తించేందుకు సామర్థ్య పరీక్షలు

శాంతిపురం ఉపకేంద్రంలో సిద్ధమైన విద్యుత్‌ స్తంభాలు 
కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు. ఇందులో లైన్‌మెన్లు, హెల్పర్లు, ఆఫీసు సిబ్బంది ఇలా వివిధ రకాల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణ. ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా జిల్లా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు.. నగదు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై కొందరు అప్పట్లోనే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే నేతల ఒత్తిళ్లలో అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. 

విచారణ వేగవంతం

బైలా ప్రకారం రెస్కో పరిధిలో 231 పోస్టులు మంజూరు చేశారు. అయితే ఐదేళ్ల కిందట కేవలం 127 మందితో సంస్థ నడిచేది. వైకాపా అధికారంలొకి రాగానే అక్రమ నియమాకాలకు తెర తీశారు. మొత్తంగా 104 మంది గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో వైకాపా నాయకుల కుమార్తెలు, కుమారులు, బంధువులున్నట్లు సమాచారం. వీరికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా నియమకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ అక్రమంలో భారీగా నగదు చేతులు మారినట్లు తెలిసింది. 

 104 మందికి సామర్థ్య పరీక్షలు

విద్యుత్‌ సంస్థల్లో క్షేత్రస్థాయి ఉద్యోగులు కచ్చితంగా స్తంభం ఎక్కాలి. నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ జరపకుండా అప్పనంగా ఉద్యోగాలు సాధించిన వారికి ఇప్పుడు ఈ పరీక్షలు పెట్టనున్నారు. ఐదేళ్లలో ఉద్యోగాలు పొందిన 104 మందికి స్తంభం ఎక్కే పరీక్ష పెట్టాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. ఈ మేరకు అధికారులు.. రెస్కో కార్యాలయ ఆవరణలో స్తంభాలు పాతారు. పక్కాగా పరీక్షలు జరిగేలా.. ఏపీఎస్పీడీసీఎల్‌ ఉద్యోగులు, జేసీ స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. దీంతో అక్రమార్కుల గుట్టు రట్టవుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని