logo

‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ

సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు..

Updated : 05 Jul 2024 06:05 IST

ఎన్నికల్లో నష్టం జరగకుండా స్వామిభక్తి చాటుకున్న వైనం

సస్పెండ్‌ చేస్తానని ఉద్యోగులకు బెదిరింపు

జడ్పీ పూర్వ సీఈవో కుట్ర కోణం

న్యూస్‌టుడే, చిత్తూరు జడ్పీ: సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు..  పెద్దిరెడ్డి చెప్పిందే వేదంగా మసలుకున్నాడు.. నాటి పెద్ద మంత్రి అడుగులకు మడుగులొత్తిన మాజీ సీఈవో ప్రభాకరరెడ్డి ప్రజాధనం పెద్దఎత్తున దుర్వినియోగమైనా.. కొందరు ఉద్యోగులు చాపకింద నీరులా దర్జాగా కాజేసినా బయటకు పొక్కనీయలేదు.. పైగా లీకయితే సస్పెండ్‌ చేస్తానని ఉద్యోగులను బెదిరించడంతో వారు భయపడి నోరు మెదపలేదు.. సాక్షాత్తూ పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన పుంగనూరులో రూ.కోటికి పైగా కుంభకోణం చోటుచేసుకుంటే ఆయనకు ఎన్నికల వేళ నష్టం జరగకూడదనే లక్ష్యంతో అడుగడుగునా భయభ్రాంతులకు గురిచేసిన ఉదంతం తాజాగా వెలుగు చూడటంతో జిల్లా ఉన్నతాధికారులు సహా జడ్పీ వర్గాలు విస్తుపోతున్నాయి.  
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సునీల్‌కుమార్‌ సాధారణ నిధుల్లో రూ.1.37 కోట్లు స్వాహా చేసిన వైనంపై అప్పట్లో కార్యాలయ సిబ్బంది నాటి సీఈవో ప్రభాకరరెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన ఆయన నేరుగా పెద్ద మంత్రిని, ఆయన సహాయకుడు తుకారాంను కలిసి విన్నవించాడు. ‘ఎన్నికలు వస్తున్నాయి.. నిధుల స్వాహా విషయం బయటకు తెలిస్తే తమ గెలుపునకు అడ్డంకి అవుతుంది.. ఎట్టిపరిస్థితుల్లో బయటకు రానీయొద్దు..’ అని వారు సూచించిందే తడవుగా నేరుగా రంగంలోకి దిగాడు. అంతే పుంగనూరు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, అధికారులను పిలిపించుకుని తనదైన శైలిలో హెచ్చరించాడు. ‘పెద్దాయనకు చెడ్డపేరు రానీయొద్దు.. ఎవరైనా బయటకు చెబితే ఇక మీ ఇష్టం.. అందర్నీ సస్పెండ్‌ చేస్తా.. జాగ్రత్త’ అని బెదిరించినట్లు సమాచారం. ఏళ్ల తరబడి ఆయన ‘లీలలు’ కళ్లారా చూసిన ఉద్యోగులు నోరు మెదపలేదు.  ఇలా ప్రజాధనం దుర్వినియోగం విషయంలో ప్రభాకరరెడ్డి దాన్ని తొక్కిపెట్టి స్వామి భక్తి చాటుకోవడం చర్చనీయాంమైంది. నిన్నటి వరకు ఆయనతో జట్టు కట్టిన, ఆయనపై ఏ వ్యతిరేక విషయాలు వెలుగు చూసినా అంతర్గతంగా పత్రికల వారిని సైతం విమర్శించే కొందరు జిల్లా అధికారులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో.. మెల్లగా ఆయన ‘నీడ’ సైతం తమపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ ప్రభావం తమపై పడి తమకెక్కడ నష్టం జరుగుతుందోనని ఓ కీలక అధికారి అంతర్గతంగా మథన పడుతున్నట్లు సమాచారం. 

సీఈవో చొరవతో వెలుగులోకి..

ప్రస్తుత జడ్పీ సీఈవో గ్లోరియాను.. పుంగనూరు ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగులు రెండు వారాల కిందట నిధుల స్వాహా విషయమై ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే నాటి కలెక్టర్‌కు విషయాన్ని చెప్పి ఆయన ఆదేశాలతో రహస్య విచారణ నిర్వహించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కోటిగా వెలుగుచూడటంతో అవాక్కవడం ఉన్నతాధికారుల వంతైంది. 


పుంగనూరు మండల పరిషత్‌ అధికారులపై వేటు
సాధారణ నిధులు రూ.1.37 కోట్లు స్వాహా
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సునీల్‌పై క్రిమినల్‌ కేసు

పుంగనూరు మండల పరిషత్తు సాధారణ నిధులు రూ.1.37 కోట్లు స్వాహా చేసిన ఉదంతంలో పలువురు అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశాల మేరకు జడ్పీ సీఈవో గ్లోరియా గురువారం సాయంత్రం సస్పెండ్‌ చేశారు. కార్యాలయంలో డేటా ఎంట్రి ఆపరేటర్‌గా పొరుగుసేవల కింద గత ఆరేళ్లుగా పనిచేస్తున్న సునీల్‌.. నాలుగేళ్లుగా దశల వారీగా పరిషత్తు సాధారణ నిధుల నుంచి నగదు స్వాహా చేశాడు. చివరికి రూ.1,36,68,668 నిధులు స్వాహా అయ్యాయని విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో అతడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇన్ని అక్రమాలు కళ్లెదుటే జరుగుతున్నా గుర్తించడంలో విఫలమైన పుంగనూరు అప్పటి ఎంపీడీవో, ప్రస్తుత ఏవో రాజేశ్వరి, ఎగువశ్రేణి సహాయకుడు రాజశేఖర్‌రెడ్డిని సైతం సస్పెండ్‌ చేశారు. మరోవైపున ఈవోపీఆర్డీ.. డీపీవో పరిధిలో ఉండటంతో తాత్కాలికగా తొలగిస్తూ డీపీవో లక్ష్మి సైతం ఉత్తర్వులు ఇచ్చారు. నాలుగేళ్లుగా మండల పరిషత్తు జనరల్‌ ఫండ్‌ నిధులు దుర్వినియోగమవుతున్నా గుర్తించడంలో అక్కడి అధికారుల వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఒక పనికి సంబంధించి రెండుసార్లు బిల్లులు పెట్టి, అధికారి వేలిముద్రలు సరిగా పడలేదని సాకులు చెప్పి.. ఇలా డబ్బు భారీగా కాజేసినట్లు గుర్తించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని