logo

కమీషన్ల కక్కుర్తి

యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది.

Published : 05 Jul 2024 02:19 IST

వైకాపా హయాంలో నాణ్యతలేని యంత్రాల కొనుగోలు

ఆయుర్వేద ఫార్మసీలో పెద్దల నిర్వాకం

ఈనాడు డిజిటల్, తిరుపతి- న్యూస్‌టుడే, చంద్రగిరి: వైకాపా పాలనలో తితిదే పరిధిలోని శ్రీశ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ పలు అక్రమాలకు వేదికగా మారింది. యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. ఈయనతోపాటు అప్పటి తితిదే ఛైర్మన్, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ నారపురెడ్డి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ మురళీకృష్ణ, పలువురు ఇంజినీరింగ్‌ అధికారులు పాత్రధారులుగా ఉన్నారని, 2021లో ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కొత్త పరికరాలు కొనుగోలు చేసేందుకు కొటేషన్‌ సిద్ధంచేసినట్లు  సమాచారం. తదనంతరం హైదరాబాద్‌కు చెందిన సంస్థకు టెండర్‌ అప్పగించారని, కేవ లం రూ.80 లక్షలు ఖర్చయ్యే యంత్రాలకు ఏకంగా రూ.3 కోట్లతో అంచనాలు రూపొందించారని చెబుతున్నారు.

నేటికీ పూర్తికాని పనులు

63 నూతన యంత్రాల్లో 15 మాత్రమే బిగించినట్లు సమాచారం. వాటిలో నాలుగు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని, కనీసం రెండు బ్యాచ్‌ల ప్రొడక్షన్‌ కూడా చేయలేకపోతున్నట్లు చెబుతున్నారు. 30 ఏళ్ల కిందట తెచ్చిన యంత్రాలు అనుకున్న స్థాయిలో ఉత్పత్తిని ఇవ్వగా.. ప్రస్తుతం వాటినే వినియోగిస్తున్నారని, కొత్త పరికరాలు దిష్టిబొమ్మల్లా మారినట్లు విమర్శలున్నాయి. కెటిల్‌ వంటి పరికరాలు అనుకున్నంత వేడెక్కడం లేదని, పలు యంత్రాలు అవసరం లేకున్నా కొనుగోలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

విజిలెన్స్‌కు పట్టుబడినా..

టెక్నికల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన నారపురెడ్డి ప్రైవేట్‌ వ్యక్తులకు మందులు విక్రయిస్తూ విజిలెన్స్‌కు పట్టుబడ్డారు. ఆయన్ను సస్పెండ్‌ చేయాల్సి ఉండగా.. కళాశాలకు పంపించారు. జేఈవో సదాభార్గవి ఈ ఫార్మసీపై దృష్టి సారించే క్రమంలో రాజకీయ ఒత్తిడికి గురిచేసి బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి.

 ప్రభుత్వం దృష్టిసారించాలి

వైకాపా ప్రభుత్వంలో ఆయుర్వేద ఫార్మసీలో జరిగిన అవకతవకలపై కమిటీ వేసి, యంత్రాల కొనుగోలు, కమీషన్ల చిట్టా మొత్తం విప్పాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే యంత్రాల బిగింపు సత్వరం పూర్తిచేయాలని, లేకుంటే వారంటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

యంత్రాలు అమర్చుతున్నారు..

ప్రస్తుతం యంత్రాల ఇన్‌స్టాలేషన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మందుల ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గతంలో జరిగిన అవకతవకల విషయం నాకు తెలియదు.
- రేణుదీక్షిత్, కళాశాల ప్రిన్సిపల్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని