logo

కుప్పంలో వినతుల వెల్లువ

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది.

Published : 05 Jul 2024 02:16 IST

ఓపిగ్గా స్వీకరించిన కలెక్టర్, అధికారులు

రీసర్వే తప్పిదాలపై అధిక ఫిర్యాదులు

శీవినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్, చిత్రంలో ఎమ్మెల్సీ కంచర్ల, జేసీ  
కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. వినతులు అందించేందుకు ప్రజలు ఉదయం నుంచే బారులుదీరారు. మొత్తం 600కిపైగా అర్జీలు రాగా.. అందులో 436 రెవెన్యూ సమస్యలపై వచ్చినట్లు అధికారులు తెలిపారు. తమ సమస్యలను ముందుగా నమోదు చేసుకునేందుకు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో అధికారుల వద్ద గంటల తరబడి నిలబడాల్సివచ్చింది. సమావేశ మందిరంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జేసీ శ్రీనివాసులు ఇతర జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. వినతులను ఆయా శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని కలెక్టర్‌ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయాలని సూచించారు. రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, పరిష్కరించి పురోగతి తెలియజేయాలన్నారు. 

నాలుగేళ్లుగా ప్రదక్షిణ 

మాది శాంతిపురం మండలం గొల్లపల్లె గ్రామం. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నడుము, కాళ్లు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్నా. రెక్కాడితేనే గానీ డొక్కాడని పరిస్థితి. గత ప్రభుత్వంలో వంద శాతం అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. దీంతో పింఛన్‌ మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. పేద బతుకులు కావడంతో పనికి పోలేక పస్తులుండాల్సి దుస్థితి. పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలి.

- ఉదయ్‌కుమార్, దివ్యాంగుడు

 


రీ-సర్వేలో భూమి మాయమైంది

వైకాపా ప్రభుత్వం తెచ్చిన రీ సర్వే చాలా మంది రైతులకు నష్టం చేసింది. నా పేరిట కుప్పం మండలం సజ్జలపల్లె రెవెన్యూ దాఖలాలో సర్వే సంఖ్య 33/1ఎ, 33/5లో 1.84 ఎకరాల భూమి ఉంది. ఇది కొనుగోలు చేసినది. అందుకు సంబంధించిన పాసు పుస్తకం సైతం ఉంది. అయితే గతేడాది చేపట్టిన రీ సర్వే తర్వాత 1.37 ఎకరాలే ఉన్నట్లు రికార్డుల్లో చూపుతోంది. 0.47 సెంట్ల భూమి ఆన్‌లైన్‌ రికార్డుల్లో మాయమైంది. ఏమైందో ఏమోనని అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ప్రయోజనం లేక పోయింది. అధికారులు సర్వే చేయించి సమస్యను పరిష్కరించాలి. - సుబ్రహ్మణ్యం, కమతమూరు

ఇతరుల పేరిట నమోదు చేశారు

మాకు రామకుప్పం మండలం కెంచనబల్ల పంచాయతీ రెడ్డివారిపాడు రెవెన్యూ లెక్క దాఖలాలో వారసత్వంగా వచ్చిన 5.70 ఎకరాల భూమి ఉంది. అందుకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు, ఆన్‌లైన్‌ రికార్డులు, వన్‌బీ ఉన్నాయి. అయితే రీ సర్వేలో ఆ భూమి వేరే వ్యక్తి పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సర్వే చేసిన రెవెన్యూ సిబ్బంది తప్పిదంతో ఇలా జరిగింది. ఈ రికార్డులపై అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఆన్‌లైన్‌లో పేరు మార్చుకున్న వ్యక్తి నేడు జమీను తనదంటూ ఆక్రమించుకున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.  - నారాయణాచారి, కెంచనబల్ల 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని