logo

ఆశలన్నీ నీలంపైనే

నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్‌లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి.

Published : 05 Jul 2024 02:06 IST

టన్ను రూ.35 వేలు 

బంగారుపాళ్యం యార్డుకు వచ్చిన నీలం మామిడి కాయలు  

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్‌లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. గత రెండ్రోజులుగా వీటి విక్రయాలు ఆశించిన మేర జరగకున్నా.. రైతులు తెచ్చిన కాయలు కొనేందుకు కొనుగోలు దారులు లేకపోవడంతో మండీల్లోనే ఉంచారు. తాజాగా గురువారం మార్కెట్‌యార్డుaకు కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల నుంచి 300 టన్నులు కాయలు అమ్మకానికి వచ్చాయి. తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని పలు ప్రాంతాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయడంతో డిమాండ్‌ పెరిగి గరిష్ఠంగా టన్ను రూ.35 వేలు ధర పలికింది. 

మూడ్రోజులుగా.. గత మూడ్రోజుల నుంచే జిల్లాలో పలుచోట్ల నీలం కాయల కోత మొదలైంది. బిహార్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనుగోలుకు ఇప్పటివరకు ఇక్కడకు రాలేదు. వారు వస్తే ధరలు పెరిగే అవకాశం ఉందని మండీ వ్యాపారులు తెలిపారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 10 శాతం పంట దిగుబడి కాలేదు. దీంతో మార్కెట్‌లో టన్నుకు రూ. 45 వేల నుంచి రూ.55 వేలకు అమ్ముడుపోతాయని రైతులు భావించారు. గతేడాది పంట దిగుబడి మూడు పువ్వులూ ఆరు కాయలు అన్నట్లుగా వచ్చింది. దీంతో పంటకు మార్కెట్‌లో డిమాండు తగ్గి టన్ను గరిష్ఠంగా రూ.15వేల మేర విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉంటాయని, నీలం తమను ఆదుకుంటుందని మామిడి రైతులు సహా వ్యాపారులు ఆశగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని