logo

అభినయా.. రోడ్లు

తిరునగరి మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది.

Published : 04 Jul 2024 03:39 IST

తారు లేచిపోవడంపై టిప్పర్‌ డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్న అభినయ్‌రెడ్డి (పాతచిత్రం)

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తిరునగరి మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది. ఆయా మార్గాల ప్రారంభోత్సవం సందర్భంగా భూమన కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు ఇప్పుడు నగరప్రజల ప్రస్తావనకు వస్తున్నాయి. ఆయా రోడ్లకు పెట్టిన పేర్లను గుర్తుచేస్తూ మురిసిపోయిన అప్పటి నేతలు కనీసం వాటిని పలకాలన్నా ప్రజలకు, అప్పటి ప్రతిపక్ష నేతలకు కష్టమేనంటూ బీరాలుపోయారు. ఓ రోడ్డులో వెళ్లిన టిప్పర్‌ బ్రేక్‌లు వేయగానే తారు మొత్తం లేచిపోగా అదే సమయంలో అటుగా వెళ్లిన అప్పటి ఉప మేయర్‌ అభినయ్‌రెడ్డి వాహన డ్రైవర్‌ను చెడామడా తిట్టిపోశారు. ఎంతో సుందరంగా నిర్మించిన మా రోడ్డుపైనే టిప్పర్‌ నడుపుతావా, రోడ్డంతా పాడు చేస్తావా అన్నట్లుగా ఆయన రెచ్చిపోయారు. అనంతరం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరలైంది. మీరు నాణ్యంగా నిర్మించి ఉంటే ఎందుకు తారు లేచిపోతుందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఒక్క లారీ వెళ్తేనే రోడ్డు ఇలాగైతే భవిష్యత్తులో రోడ్డు మొత్తం ఊడిపోతుందేమో’.. ‘రోడ్డు పోతే డ్రైవర్‌ను అడుగుతావేంది.. రోడ్డేసిన గుత్తేదారును అడుగు స్వామీ’ అంటూ పలు విమర్శలు గుప్పించారు. తాజాగా కుళశేఖర్‌ ఆళ్వార్‌ మార్గం ఎక్కడికక్కడ కుంగిపోవడం, తారు లేచిపోవడం చూసిన ప్రతిపక్షాలు, నగరవాసులు ‘ఆహా.. ఇవేనా మీరు నిర్మించిన బృహత్తర రోడ్లు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నాణ్యత ఏదీ అభినయ్‌ సారూ.. అంటూ నిలదీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని