logo

స్థలాలు చదును చేసి.. నిధులు పక్కదారి పట్టించి

జగనన్న కాలనీల్లో చదును పేరిట వైకాపా నాయకుల అనుయాయులకు పనులు కట్టబెట్టి పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారు. తీరా చూస్తే అక్కడ గోరంత పనికి కొండంత వసూలు పర్వాలకు తెరతీశారు. చదునుపేరిట ఉపాధిహామీ, టిడ్కో నిధులు దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతున్నాయి.

Published : 04 Jul 2024 03:37 IST

జగనన్న కాలనీల్లో వైకాపా నేతల చేతివాటం   

మన్నారు పోలూరు వద్ద గ్రావెల్‌ గుట్టలు మాయమైన ప్రాంతం (పాతచిత్రం)

జగనన్న కాలనీల్లో చదును పేరిట వైకాపా నాయకుల అనుయాయులకు పనులు కట్టబెట్టి పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారు. తీరా చూస్తే అక్కడ గోరంత పనికి కొండంత వసూలు పర్వాలకు తెరతీశారు. చదునుపేరిట ఉపాధిహామీ, టిడ్కో నిధులు దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 962 ప్రాంతాల్లో 2,020.09 ఎకరాల్లో కాలనీలు ఏర్పాటు చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా రూ.29.27 కోట్లు వెచ్చించారు.  కాలనీలో ఒక్కో వ్యక్తికి 654 చదరపు అడుగుల స్థలం ఇచ్చారు.

న్యూస్‌టుడే, గూడూరు, కోట, వెంకటగిరి

నేతల మేతకు ఉపాధి నిధులు

నాయుడుపేట మండలం జువ్వలపాళెం పంచాయతీలోని జగనన్న కాలనీ చదును పేరిట 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2.36 కోట్లు చెల్లింపులు చేశారు. ఇందులో కూలీలకు మాత్రం రూ.26.96 లక్షలు చెల్లింపులు చేపట్టగా మెటీరియల్‌కు అగ్రభాగం చెల్లించేశారు. ఇదే తీరుగా కల్లిపేడు పంచాయతీలో మరో పనికి రూ. 1.12 కోట్లు చెల్లింపులు చేశారు. ఇదే ప్రాంతంలో రెండు చోట్ల రూ.30 లక్షలు వెచ్చించారు. పాకాల మండలం పంటపల్లిలో రెండుచోట్ల జగనన్న కాలనీలో చదును పేరిట రూ.23.78 లక్షలు, రూ.18.26 లక్షలు వెచ్చించారు. ఇంకా కొనసాగింపు పనిగా చూపిస్తున్నారు. చిట్టమూరు మండలం ఈశ్వరవాకలో రెండు పనుల పేరిట రూ.7.17 లక్షలు, రూ.3.92 లక్షలు ఖర్చు చేశారు.

గుట్టలు మాయం

సూళ్లూరుపేట పట్టణం మన్నారుపోలూరు సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో పెద్దఎత్తున గ్రావెల్‌ నిల్వలు ఉండగా వాటిని తరలించి సొమ్ము చేసుకున్నారు. చదును పేరిట రూ.కోట్ల నిధులు వెచ్చించారు. గూడూరు మండలం కొమ్మినేటూరులో రెండుచోట్ల చదును పేరిట రూ.6.58 లక్షలు, రూ.5.70 లక్షలు బిల్లులు చెల్లించగా ఇళ్ల పట్టాలు పంపిణీకే వ్యవహారం పరిమితమైంది. హౌసింగ్‌ కాలనీ అభివృద్ధి పేరిట పెద్దఎత్తున స్వాహా జరిగింది. వెందోడులో రూ.8.57 లక్షలు, రూ.4.32 లక్షలు లెక్కన రెండుచోట్ల భూమి అభివృద్ధి నిధులు కాజేశారు. కోట మండలం చెందోడులో ఏకంగా రూ.17.06 లక్షలు వెచ్చించి కాలనీ చదును చేయించినట్లు చూపించారు. చిట్టేడులో మూడు పనులకు గాను రూ.15 లక్షలు వ్యయం చేయగా సమీపంలోని గ్రావెల్, మట్టితో చదును చేయించి మమ అనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని