logo

కాసుల వ్యయం.. ప్రగతి శూన్యం

‘గత ఐదేళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చుపెట్టారు.. ఎక్కడా చిన్న పని జరగలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి..

Published : 04 Jul 2024 03:17 IST

ఐదేళ్లలో వైకాపా అడ్డగోలు పాలన
సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం
జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో తెదేపా ఎమ్మెల్యేల ధ్వజం

గౌరవ వేతనాలు ఇవ్వడం లేదని జడ్పీ ఛైర్మన్‌కు వినతిపత్రం అందజేస్తున్న తెదేపా జడ్పీటీసీ సభ్యుడు

చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: ‘గత ఐదేళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చుపెట్టారు.. ఎక్కడా చిన్న పని జరగలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.. అనుమతుల్లేని పనులు ఇంకెన్నో చేపట్టారు.. ఇదేం పద్ధతి.. సభ్యులకు గౌరవమూ లేదట.. ఇదేం పాలన..’ అంటూ తెదేపా శాసనసభ్యులు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, కలికిరి మురళీమోహన్, వీఎం థామస్‌ బుధవారం నిర్వహించిన జడ్పీ 1, 2, 4, 7 స్థాయీ సంఘ సమావేశాల్లో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదామని పిలుపునిచ్చారు. ‘వైకాపా పాలనలో జడ్పీటీసీ సభ్యులకు కనీస గౌరవం ఇవ్వలేదు.. ఇదేనా మర్యాద, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాల్లో తమ పేర్లు లేవని.. ఇదేనా మీరిచ్చే గౌరవం’ అని తెదేపా జడ్పీటీసీ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెదేపాలో చేరిన శ్రీకాళహస్తి, ఏర్పేడు జడ్పీటీసీ సభ్యులు సుబ్బారెడ్డి, తిరుమలయ్య మాట్లాడుతూ జడ్పీ సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు ఫొటో ఎందుకు పెట్టలేదు. మేం డబ్బులిస్తామని ఫొటో తేవాలనడంతో అప్పటికప్పుడు అధికారులు ఏర్పాటు చేశారు. ఇకపై ప్రొటోకాల్‌ తప్పక పాటిస్తామని ఛైర్మన్‌ వివరణ ఇచ్చారు. అజెండాలోని అంశాలను సీఈవో గ్లోరియా చదివి వినిపించారు. గతంలో వేర్వేరుగా నిర్వహించే సమావేశాలు ఈ విడత అన్నీ కలిపి నిర్వహించడం గమనార్హం.

అనుమతుల్లేని పనులపై చర్యల్లేవా..?

గ్రామ సచివాలయాల్లో వ్యక్తుల పేర్లు తొలగించాలి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి జడ్పీ నిధులు మంజూరు చేయాలి. జలవనరుల శాఖ అనుమతి లేకుండా తుడా తరఫున టెండర్లు పిలిచి పనులు చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చి ఏం చర్యలు తీసుకున్నారు. వంక, డీకేటీ భూముల్లో నిర్మించిన గృహాలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్నారు. గృహాల మధ్య ఉన్న నియంత్రికలతో ప్రజలకు ఇబ్బందిగా ఉంది.

పులివర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే

పల్లెల్లో అన్నీ సమస్యలే

సంక్షేమాలకు బటన్‌ నొక్కాం. నిధులిచ్చాం అంటే ఎలా? అభివృద్ధి ఎక్కడ జరిగింది? గ్రామాల్లో అన్నీ సమస్యలే. తెదేపా పాలనలో చేపట్టిన నీరు-చెట్టు పనులకు బిల్లులు చెల్లించలేదు. జైకా నిధులు విడుదల చేస్తే ఆ పనులకూ బిల్లులు ఇవ్వలేదు. గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయాలి. టిడ్కో గృహాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలి.

గురజాల జగన్మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే

మన నీరు తమిళనాడు చెరువులకా?

కృష్ణాపురం జలాశయం గేట్ల మరమ్మతులు చేపట్టలేదు. నేను రూ.10వేలు ఇస్తే సిద్ధం చేశారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి దృష్టిసారించక పోవడంతో ఆ నీరు తమిళనాడు చెరువులకు వెళ్లేది. కృష్ణాపురం ప్రాజెక్టుకు అర కిమీ దూరంలో కత్తిరిపల్లె వద్ద రూ.85 కోట్లతో ప్రాజెక్టు చేపడతారా? ఇదెక్కడి న్యాయం. ఎన్టీఆర్‌ జలాశయం నీటికి 33 చెరువులు అనుసంధానం చేస్తామన్నారు.. ఎక్కడ చేశారు.?

థామస్, జీడీనెల్లూరు ఎమ్మెల్యే

అస్పష్ట సమాచారం ఇవ్వడం భావ్యమేనా?

జడ్పీ సమావేశ అజెండాలో వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. అంచనాలు, వ్యయాల్లో రూ.లక్షలా.. కోట్లా అని తెలియడం లేదు. గత ప్రభుత్వం జడ్పీటీసీ సభ్యులకు గౌరవం ఇవ్వడం లేదని సభ్యులు పేర్కొనడం బాధాకరం. పూతలపట్టు మండలం దొడ్డిగాని చెరువు పనులు 2018లో చేస్తే నిధులివ్వలేదు. వైకాపా అనాలోచిత నిర్ణయాలతో చెరువుల పనులు నిలిచిపోయాయి.

మురళీమోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే

నూతన ఎమ్మెల్యేలకు సత్కారం

నూతనంగా గెలుపొందిన తెదేపా ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, కలికిరి మురళీమోహన్, థామస్‌లను.. జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, వైస్‌ ఛైర్‌పర్సన్‌ రమ్య, ఐదో స్థాయీ సంఘ ఛైర్‌పర్సన్‌ భారతి, సీఈవో గ్లోరియా పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని