logo

నాడు-నేడు నిర్లక్ష్యం గడ్డ కట్టేసింది..

నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్‌ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి.

Published : 04 Jul 2024 03:05 IST

హెచ్‌ఎం ఉద్యోగ విరమణ అనంతరం వెలుగులోకి

వైర్లతో వేలాడుతున్న ఫ్యాను కింద విద్యార్థులు

పాలసముద్రం, న్యూస్‌టుడే: నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్‌ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. మండలంలోని తిరుమలరాజుపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు అసంపూర్తిగా నిలిచిపోవడం, సిమెంట్‌ బస్తాలు గడ్డ కట్టిపోవడం, విద్యార్ధులు భయాందోళన మధ్య చదువులు కొనసాగడం.. ఇవన్నీ హెచ్‌ఎం ఉద్యోగ విరమణ అనంతరం వెలుగు చూశాయి.

తిరుమలరాజుపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు 2022లో అదనపు గదులు, ప్రహరీ, సీలింగ్‌ లీకేజీ, మరుగుదొడ్లు, విద్యుత్తు పనులు, రూఫ్‌ లీకేజీ, ట్యాంకు మరమ్మతులకు నాడు-నేడు కింద రూ.82 లక్షలు కేటాయించారు. ఆయా పనులు కొన్ని చేపట్టినా అసంపూర్తిగా నిలిచాయి. తూతూమంత్రంగా పనులు చేపట్టి గదులు వదిలేశారు. విద్యార్ధులు వెలుతురు, గాలి లేక ఊపిరాడక ఇబ్బందికరంగా చదువులు కొనసాగిస్తున్నారు. వాటి బాధ్యతను హెచ్‌ఎం, ఏఈలకు అప్పగించారు. ఇద్దరి నిర్లక్ష్యంతో పాఠశాలలో పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్ధులకు కష్టాలు తప్పడం లేదు.

మరోవైపున ఆయా పనులకు తెచ్చిన సిమెంట్‌ వినియోగించకపోవడంతో సుమారు 500కు పైగా బస్తాలు గడ్డ కట్టేసినట్లు బుధవారం గుర్తించారు. హెచ్‌ఎం, విద్యాశాఖ, ఏఈ, సమగ్ర శిక్ష అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడ్డ కట్టేసిన సిమెంట్‌తో నిర్మాణాలు చేపడితే నాణ్యత సమస్య వస్తుందని తెలిసినా గుట్టుగా పనులు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగిన పనులకు రూ.32.64 లక్షలు మంజూరైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎం ఉద్యోగ విరమణ అనంతరం ఆయా పనులు చేపట్టేందుకు ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన వారు ముందుకు రావడం లేదు.

గడ్డకట్టిన సిమెంట్‌ బస్తాలు

ఈ విషయమై సమగ్ర శిక్షా ఏఈ మునిరత్నంను  వివరణ కోరగా.. నాడు-నేడు పనులకు సంబంధించి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఆగాయని, వెంటనే సిమెంట్‌ బస్తాల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లులు పరిశీలిస్తామని
తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని