logo

పుత్తూరు ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి

పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని మృతి చెందిన బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.

Published : 04 Jul 2024 03:00 IST

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆందోళన

పుత్తూరు, న్యూస్‌టుడే: పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పుత్తూరు వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని మృతి చెందిన బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. కార్వేటినగరం మండలం సురేంద్రనగరం పంచాయతీ పరిధిలోని ద్వారకానగరానికి చెందిన నరేష్, పూర్ణిమ భార్యాభర్తలు. పూర్ణిమకు నెలలు నిండటంతో సోమవారం రాత్రి పుత్తూరు ఆస్పత్రికి తెచ్చారు. ఆమె సోమవారం రాత్రి మగ్గబిడ్డను ప్రసవించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా పురిటిబిడ్డలో చలనం లేకపోవడంతో డాక్టర్‌ ఉదయ్, నర్సులు రక్షణ్య, గీత, వరలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. వారు వచ్చి చూడగా అప్పటికే నోటిలో పాలు ఉండటంతో బిడ్డకు పాలిచ్చే సమయంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఊపిరి తీసుకోవడం కష్టమై మృతి చెంది ఉంటాడని నిర్ధారించారు. పాలు పట్టే సమయంలో పొలమారితే భుజంపై వేసుకుని వెనుకవైపు తట్టాలని ముందుగానే బిడ్డ తల్లికి చెప్పినట్లు డాక్టర్‌ వివరించారు. ఈ సమయంలో బిడ్డ తల్లి స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెకు సెలైన్‌ పెట్టారు. నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు.. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

  • వైద్యుల నిర్లక్ష్యం వల్లే పురిటి బిడ్డ మృతి చెందినట్లు బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. సోమవారం రాత్రి ప్రసవం జరిగితే మంగళవారం రాత్రి వరకు వైద్యులు చూడలేదని వాపోయారు. వేరే ఆస్పత్రికి వెళ్లాలని చెప్పినా ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు.

అధికారుల విచారణ.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని తిరుపతి ఆర్‌డీవో నిషాంత్‌రెడ్డి, డీఎంహెచ్‌వో శ్రీహరి, డీసీహెచ్‌ఎస్‌ మురళీకృష్ణ, డీపీఎంవో శ్రీనివాస్, డీఐవో శాంతకుమారిని తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ధ్యానచôద్ర ఆదేశించారు. వారు బుధవారం ఆస్పత్రికి వచ్చి వైద్యులు, నర్సులు, బాధితులతో మాట్లాడారు. ఆర్డీవో వెంట తహసీల్దార్‌ శ్రీనివాసగౌడ్, సూపరింటెండెంట్‌ గురుస్వామి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని