logo

జగనన్న కాలనీల్లో కన్నీటి కష్టాలు!

‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం.

Updated : 04 Jul 2024 04:48 IST

బోర్లు వేసినా ట్యాంకులు, కుళాయి కనెక్షన్లు లేక అరకొర సరఫరా

కుప్పం పురపాలిక పరిధిలో నీటి సదుపాయం లేని లక్ష్మీపురం కాలనీ

బైరెడ్డిపల్లె, కుప్పం పట్టణం, పెద్దపంజాణి, న్యూస్‌టుడే: ‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం. కాలనీల్లో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా మౌలిక వసతులు కల్పిస్తాం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలు చెప్పారు. అయితే చాలా కాలనీల్లో ఐదేళ్లలో కనీసం తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయలేకపోయారు. బోర్లు వేసి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్లు వేసి వీధులకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. బోరు నుంచి నేరుగా సరఫరా చేస్తుండటంతో విద్యుత్‌ కష్టాలతో ఇబ్బందులు తప్పడం లేదు.

పలుమార్లు వాయిదాలు

గతేడాది ఉగాది నాటికి తొలివిడత మంజూరు చేసిన 75,393 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించారు. తర్వాత నాలుగుసార్లు దాన్ని వాయిదా వేశారు. ఇప్పటికీ తొలివిడత మంజూరు చేసిన పక్కా గృహాలే పూర్తికాలేని పరిస్థితి నెలకొంది. దూర ప్రాంతాల్లో కాలనీల ఏర్పాటు, వసతులు కల్పించడంలో విఫలం కావడంతో నిర్మాణాలు చేపట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపలేకపోయారు. మూడేళ్లలో 45,837 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. రెండో విడత ఇల్లు కావాలని లబ్ధిదారులు అడిగినా ప్రభుత్వం విస్మరించింది.

మచ్చుకు కొన్ని చోట్ల..

బైరెడ్డిపల్లె ఆంజనేయస్వామి ఆలయం పక్కన జగనన్న కాలనీలో నీటి వసతి లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 84 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. పెద్దపంజాణి మండలం బసవరాజుకండ్రిగ జగనన్న కాలనీలో లబ్ధిదారులకు నీటితొట్టే దిక్కు. ఇక్కడ 28 మంది లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 18 మందే పూర్తి చేశారు. కుప్పం పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం జగనన్న కాలనీలో అరకొర నీటి సరఫరాతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కాలనీలో 446 మందికి ఇంటి స్థలాలు కేటాయించి 342 మందికి పక్కా గృహాలు మంజూరు చేశారు. ఇక్కడ తాగునీటికి బోరు ఏర్పాటు చేసి పైపులైన్లు అమర్చారు. ట్యాంకు నిర్మాణం, కుళాయిలు ఏర్పాటు మరిచారు.

నీటి సరఫరా అంతంతమాత్రమే

జగనన్న కాలనీల్లో అన్ని వసతులు కల్పించాం. ఇంటి నిర్మాణాలు పూర్తి చేయకుంటే పట్టా రద్దు చేస్తామని ఓ దశలో అధికారులు ఒత్తిడి తెచ్చారు. మౌలిక వసతులు కల్పించకుండా తాము ఇల్లు ఎలా కట్టుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నించారు. చాలా చోట్ల ఓ మూలన చిన్న ట్యాంకు ఏర్పాటు చేసి వదిలేశారు. నిర్మాణ పనులకు లబ్ధిదారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రతిపాదనలు పంపాం..

జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాం. బోర్లు వేయించాం. కొన్నిచోట్ల ట్యాంకులు నిర్మాణదశలో ఉన్నాయి. పెండింగ్‌ పనులు పూర్తి చేయించి కుళాయిల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం.

రమేష్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ డీఈఈ, పలమనేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని