logo

వేణుగోపాలా.. ఇదేమి విడ్డూరం

రూ.కోట్ల విలువైన భూములు.. రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకునే మార్గాలున్నా.. ఆలయ జీర్ణోద్ధరణకు చందాలు సమీకరించేందుకు ఈవో సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది.

Published : 04 Jul 2024 02:50 IST

ఆదాయ మార్గాలున్నా.. జీర్ణోద్ధరణకు చందాలే ఆధారం

ఆలయంలో మాట్లాడుతున్న సభ్యులు, ఈవో

చౌడేపల్లె, న్యూస్‌టుడే: రూ.కోట్ల విలువైన భూములు.. రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకునే మార్గాలున్నా.. ఆలయ జీర్ణోద్ధరణకు చందాలు సమీకరించేందుకు ఈవో సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. చౌడేపల్లెలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వందల ఎకరాల మాన్యం ఉంది.డా ఆ భూములు కౌలు, లీజుకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకోవచ్చు. దీన్ని విస్మరించిన ఆలయ ఈవో కమలాకర్‌రావు బుధవారం స్థానిక ఆలయంలో జీర్ణోద్ధరణకు నిధులు లేవని, సమీకరణపై గ్రామ పెద్దలతో గోప్యంగా సమావేశం నిర్వహించారు. చందాల వసూలుకు సహకరించాలని కోరారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని గత ప్రభుత్వం సర్వశ్రేయోనిధి రూ.3 కోట్లు, దాత ఎస్‌కే రమణారెడ్డి రూ.50 లక్షలతో గోపురాన్ని నిర్మించారు. ప్రస్తుతం జీర్ణోద్ధరణ చేయడానికి నిధులు లేవని ఈవో ఇలా రావడం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. ఆలయం కట్టిన గుత్తేదారు, ఆదాయ మార్గాల ద్వారా వచ్చే మొత్తాన్ని అందుకు వినియోగించాలని గ్రామపెద్దలు ఈవోకు సూచించారు. చౌడేపల్లె బస్టాండు, గ్రామానికి పక్కనే విలువైన భూములను అక్రమార్కులకు కట్టబెట్టి ఇలా చందాలపై ఈవో దృష్టి పెట్టడం విడ్డూరమని బహిరంగ విమర్శలు చేశారు. ఆలయ నిర్మాణ పనుల్లో నిధుల గోల్‌మాల్‌ జరిగిందని, దాత నిర్మించి ఇచ్చిన గోపురానికి రంగులు బాగాలేవని, వేరే రంగులు వేసి.. రూ.80 లక్షలు డ్రా చేశారని గ్రామస్థులు ఆరోపించారు. త్వరలో పూర్తి వివరాలు ఆధారాలతో బయట పెడతామన్నారు.

వేలంతో రూ.1.87 కోట్ల ఆదాయం

ఐరాల, న్యూస్‌టుడే: కాణిపాకం పంచాయతీ, స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం సంయుక్తంగా బుధవారం నిర్వహించిన వాహనాల పార్కింగ్‌ రుసుము వసూలు బహిరంగ వేలంతో రూ.1,87,29,999 ఆదాయం సమకూరినట్లు సర్పంచి కె.శాంతిసాగర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వడ్రాంపల్లె పంచాయతీ మిట్టఇండ్లుకు చెందిన ఆర్‌.సురేశ్‌బాబు హెచ్చుపాటదారుడిగా నిలిచారు. వారపు సంత, దినసరి మార్కెట్‌కు వేలం వాయిదా వేసినట్లు వివరించారు. మండల ఈవోపీఆర్డీ కుసుమకుమారి, పంచాయతీ కార్యదర్శి సత్యంరెడ్డి, కాణిపాకం ఆలయ ఏఈవో రవీంద్రబాబు, గుత్తేదారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని