logo

పథకమేసి.. దోపిడీ చేసి

పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు.

Published : 04 Jul 2024 02:48 IST

రూ.80 లక్షల చోరీ కేసు ఛేదన

మాట్లాడుతున్న ఏఎస్పీ సౌజన్య. చిత్రంలో నగదు. వెనుకవైపు ముసుగులో నిందితులు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. అనుకున్నట్టుగానే.. ముందుగా నియమించుకున్న వ్యక్తులు కారులో వెంబడించారు. మధ్యలో బస్సు దాబా వద్ద ఆగగా.. ఏమీ ఎరగనట్టు బస్సులో కూర్చున్నాడు. సహచరుడు కిందకు వెళ్లగానే పథకాన్ని పూర్తిగా అమలు చేశాడు. ఏమీ తెలియనట్లుగా సహచరుడితో కలిసి ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో.. కథ అడ్డం తిరిగింది. విషయం బయటపడింది. సంబంధిత వివరాలను ఏఎస్పీ సౌజన్య బుధవారం విలేకరులకు వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...చింతకుంట చెన్నకేశవరెడ్డి స్టోర్‌ అసిస్టెంట్‌గా, పెద్దపంజాణి మండలం చలమంగళం గ్రామానికి చెందిన హరినాథ్‌రెడ్డి అకౌంట్‌ అసిస్టెంట్‌గా చెన్నైలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. వీరు సోమవారం విజయవాడ నుంచి కంపెనీ తాలూకు రూ.80 లక్షల నగదు తీసుకుని ట్రావెల్స్‌ బస్సులో చెన్నైకు బయలుదేరారు. కావలి రుద్రకోట సమీపంలో దాబా వద్ద బస్సు ఆగగా.. చెన్నకేశవరెడ్డి కిందకు దిగారు. హరినాథ్‌రెడ్డి బస్సులోనే ఉన్నారు. వెనుకే కారులో వచ్చిన ఇద్దరు.. బస్సు ఎక్కి, హరినాథ్‌రెడ్డికి మత్తు మందు ఇచ్చి నగదు సంచులను ఎత్తుకెళ్లారు. ఇదే విషయాన్ని చెన్నకేశవరెడ్డికి చెప్పగా.. ఇద్దరూ అదే
రోజు రాత్రి కావలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కావలి డీఎస్పీ ఎం.వి.వెంకటరమణ, సీసీఎస్‌ డీఎస్పీ పి.రామకృష్ణాచారి నేతృత్వంలో కావలి గ్రామీణ, ఒకటో పట్టణ ఇన్‌స్పెక్టర్లు కె.శ్రీనివాసరావు, రాజేష్‌ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించగా.. నగదు సంచులతో ఇద్దరు బస్సు దిగి కారులో వెళ్లినట్లు గుర్తించారు. వారు విజయవాడ నుంచి బస్సును వెంబడిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఇద్దరు ఉద్యోగులను వేర్వేరుగా విచారించగా.. హరినాథరెడ్డి స్నేహితులతో కలిసి నగదు దోపిడీ చేసినట్లు వెల్లడైంది.

అవసరాల కోసం..

అవసరాల కోసం కంపెనీ నగదు కాజేయాలని హరినాథ్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని.. స్నేహితులైన అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన వినోద్‌కుమార్, రమేశ్‌కు చెప్పి పథక రచన చేశారు. అందుకు కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన యాసిన్‌బాషా, దివాసన బనవార్‌ను నియమించుకున్నారు. వీరు కారులో బస్సును వెంబడించి.. నగదు దోచుకెళ్లేలా పథకమేశారు. ఈ నెల ఒకటో తేదీ కంపెనీ స్టోర్‌ అసిస్టెంట్‌తో కలిసి.. విజయవాడ నుంచి రూ.80 లక్షల నగదు ట్రావెల్స్‌ బస్సులో చెన్నైకు తీసుకెళ్తుండగా.. అమలు చేశారు. వినోద్‌కుమార్, రమేశ్‌ బస్సులో ఎక్కగా.. మరో ఇద్దరు కారులో వెంబడించారు. కావలి సమీపంలో దాబా వద్ద నిందితులు నగదు సంచులు తీసుకుని కారులో పరారయ్యారు. బుధవారం మదనపల్లె, బెంగళూరు సమీపంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.77.50 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. కావలి గ్రామీణ, ఒకటో పట్టణ ఇన్‌స్పెక్టర్లు, దుత్తలూరు ఎస్సై ఉమాశంకర్, సిబ్బందిని ఏఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని