logo

వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!

ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి.

Published : 03 Jul 2024 02:42 IST

ఐదేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు అధికారులు
సామాన్యులు, తెదేపా నేతలకు అడుగడుగునా ఇబ్బందులు

ఈనాడు, చిత్తూరు: ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. ఐదేళ్ల వైకాపా పాలనలో కొందరు వీటికి తిలోదకాలు ఇచ్చారు. ఫ్యాను పార్టీ నేతలు చెప్పిన ప్రతి దానికీ తలూపి నిబంధనలు తుంగలో తొక్కారు. అచ్చంగా వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. వారు తీసుకున్న చర్యలతో అటు సామాన్యులు, ఇటు తెదేపా, జనసేన, భాజపా నాయకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

రైతులను ఇబ్బంది పెట్టిన శ్యాంప్రసాద్‌రెడ్డి  

సోమల మండలంలో డిప్యూటీ తహసీల్దారు (డీటీ)గా ఉన్న శ్యాంప్రసాద్‌రెడ్డి ఐదేళ్లపాటు పెత్తనం చెలాయించారు. తన అధికారాన్ని తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికే వినియోగించారు. ఆవులపల్లి రిజర్వాయర్‌లో భూములు కోల్పోయే రైతులకు కనీసం ఎంత పరిహారం చెల్లిస్తున్నారో కూడా ఆయన చెప్పలేదు. తెదేపా మద్దతుదారులకు పట్టాలు ఉన్నా అవి అటవీ భూములని చెప్పి కందకాలు తవ్వించి ఇక్కట్లకు గురి చేశారు. వైకాపా నేతలు ఆక్రమణలకు తెగబడితే చర్యలు తీసుకోకుండా వారికే సహకరించారు. ఎక్కడా లేనట్టుగా ఇక్కడే నాలుగేళ్లపాటు డీటీనే ఇన్‌ఛార్జి తహసీల్దారుగా వ్యవహరించారు. గతంలో షబ్బీర్‌ అనే వ్యక్తికి పోస్టింగ్‌ ఇచ్చినా ఆయన విధుల్లో చేరలేదంటే ఎంతటి అరాచక పరిస్థితులు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది.


తెలుగు మహిళలపై కక్ష కట్టిన సీఐ శ్రీనివాసంతి  

నగరి పట్టణ, రూరల్‌ సీఐగా పనిచేసిన సీఐ శ్రీనివాసంతి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై కక్ష కట్టారు. అప్పటి మంత్రి రోజా ఆదేశాలే శిరోధార్యమన్నట్లుగా ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో నగరి నియోజకవర్గంలో ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రోజా అవినీతిని ఎండగట్టారు. దీంతో ఆమె లోకేశ్‌ను దుయ్యబట్టారు. తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మీర, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అరుణ తదితరులు నగరిలోని రోజా ఇంటికి చీర, సారెతో వెళ్లగా పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మహిళా నేతలతో మాట్లాడేందుకు వెళ్లిన తెదేపా నాయకులతో సీఐ అనుచితంగా ప్రవర్తించారు. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్‌రాయల్‌.. రోజాపై విమర్శలు చేశారని ఓ కార్పొరేటర్‌ ఫిర్యాదు చేయడంతో 2022 నవంబరులో అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చరవాణిలోని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అంతర్జాలంలో పెట్టి పరువు తీస్తామని ఆయన్ను బెదిరించారు. సీఐ శ్రీనివాసంతే ఈ ఘటనకు కారణమని కిరణ్‌ రాయల్‌ ఆరోపించారు.


వైకాపా నేతల దాడిని కప్పిపుచ్చిన ఎస్సై

కల్లూరు ఎస్సైగా విధులు నిర్వర్తించిన శ్రీనివాసు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నమ్మిన బంటు. వైకాపా నేతలు.. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తే తిరిగి బాధితులపై కేసులు పెట్టిన ఘనుడు ఈయన. పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త శివకుమార్‌ వైకాపా శ్రేణుల ఇసుక అక్రమ రవాణాకు అభ్యంతరం చెప్పారని దాడి చేశారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన శివశక్తి డెయిరీకి తీసుకెళ్లి చేతులు విరగ్గొట్టి రోడ్డు పక్కన పడేశారు. దీనిపై అప్పట్లో ఎస్సైను ప్రశ్నిస్తే ట్రాక్టర్‌ నుంచి కిందపడ్డాడని సమాధానమిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం తరఫున పోటీ చేయాలని చూసిన వ్యక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి బెదిరించారు. కేసులు లేవని పత్రాలు ఇచ్చేందుకూ నిరాకరించారు.


ఉన్నతాధికారులనూ లెక్క చేయని పెద్దిరెడ్డి వెంకట రమణారెడ్డి

సహకార శాఖలో ఉద్యోగం చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట రమణారెడ్డి వైకాపా అధికారంలోకి రాగానే డిప్యుటేషన్‌పై సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌గా వచ్చారు. పెద్దిరెడ్డి అండదండలతోనే ఆయన పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. నాడు- నేడు పనుల్లో పుంగనూరు నియోజకవర్గానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. పలు పనుల్లో ఆయన పర్సంటేజీలూ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. డిప్యుటేషన్‌ ముగిసిన తర్వాత కూడా ఆ శాఖలోనే ఉన్నారు. కొంతకాలం తర్వాత పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. పెద్దిరెడ్డి బంధువునని చెప్పుకొంటూ ఉన్నతాధికారులనూ లెక్క చేయలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు