logo

సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?

సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది.

Published : 03 Jul 2024 02:37 IST

అక్రమార్కులపై చర్యలు తీసుకుంటేనే వ్యవస్థ గాడిలోకి
చ్రలానా కట్టినా ముడుపులు చెల్లించాలంటున్న కొందరు సర్వేయర్లు

ఈనాడు, చిత్తూరు: సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. కార్యాలయం నుంచి అడుగు బయట పెట్టింది మొదలు భూమి వద్దకు చేరుకునేంత వరకూ కొందరు సర్వేయర్లు డబ్బులు వసూలు చేస్తూ కర్షకుల జేబులు ఖాళీ చేస్తున్నారు. పలుసార్లు ఈ వ్యవహారం ముదిరి పాకాన పడి సస్పెన్షన్లకూ దారి తీస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రతి మండలంలో ఎన్ని అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి? దరఖాస్తు చేసుకుని పరిష్కరించకపోయినా రైతాంగం నుంచి సంతకాలు తీసుకున్న ఘటనలు ఏమైనా ఉన్నాయా? అని విచారిస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. అన్నదాతలకు భూమే ఓ భరోసా. పిల్లల చదువులు, వివాహాలు, అనారోగ్య సమస్యలు తలెత్తినా మరొకరిపై ఆధారపడకుండా ధీమాగా ఉండేందుకు దోహదం చేస్తుంది. తమ తదనంతరం వారసులకు అప్పగించాలన్నది రైతుల ఆశ. అటువంటి స్థలంలో కొంతభాగాన్ని పక్క పొలం వ్యక్తి ఆక్రమించినా, ఎవరైనా వివాదాలు సృష్టించినా వెంటనే గుర్తుకు వచ్చేది సర్వేయర్లే. అక్కడ తమ సమస్య పరిష్కారమవుతుందని కొండంత ఆశతో వెళితే డబ్బులు పోగొట్టుకుని ఇంటికి చేరాల్సిన దుస్థితి ఎదురవుతోంది.

  • శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి స్థలం సర్వే చేసి సబ్‌ డివిజన్‌ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్‌ తెలుగుదేశం నాయకుల నుంచి రూ.1.80 లక్షలు తీసుకున్నారు. భూ సర్వే కోసం మరో రైతును రూ.లక్ష డిమాండ్‌ చేయడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.
  • తన పొలం సర్వే చేయాలంటూ యాదమరి మండలానికి చెందిన ఓ రైతు అర్జీ పెట్టుకుని చలానా కట్టి ఆరు నెలలు దాటినా సర్వేయర్‌ స్పందించలేదు. కలెక్టరేట్‌లో దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని చెప్పగా అప్పుడు గ్రామ సర్వేయర్‌ రంగంలోకి దిగి రూ.20వేలు చెల్లించాలని స్పష్టం చేశారు. చివరకు సదరు రైతు నుంచి రూ.15వేలు తీసుకుని పనిచేశారు.

సంతకాలు చేయించుకుని.. చలానాలు కట్టించి  

ఎవరైనా సర్వే చేసేందుకు లంచం ఇవ్వకుంటే ఏదో ఒక సాకు చెప్పి సిబ్బంది కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పించడం రివాజుగా మారింది. వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినా అదే పరిస్థితి. గడువు ముగిసే సమయంలో చలానా కట్టిన వ్యక్తితో త్వరలోనే సర్వేకు వస్తామని చెప్పి సంతకాలు చేయించుకుంటున్నారు. తర్వాత బాధితులు మరోసారి చలానాలు కడుతున్నారు. ఇలా నెలల తరబడి సమస్యను పరిష్కరించడంలేదు. ప్రశ్నిస్తే భూ విస్తీర్ణం తగ్గించి ఎక్కడ కొత్త చిక్కులు తెస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తరచూ ఫిర్యాదులు వస్తున్న మండలాల్లోని సర్వేయర్లపై ఓ కన్ను వేసి ఒకరిద్దరిపై వేటు వేస్తే మిగతావారూ గాడిలో పడతారు.

ఎకరాకు రూ.5-50 వేలు

రైతులు తమ భూమి సర్వే చేయాలంటే ముందుగా చలానా కట్టాలి. ప్రతి సర్వే నంబరుకు రూ.545 చెల్లిస్తే ఏ రోజు సర్వే శాఖ సిబ్బంది వచ్చి కొలతలు తీస్తారో ఫోన్‌ ద్వారా సిబ్బంది చెబుతారు. న్యాయ వివాదాలు లేకుంటే 15 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం గడువు విధించింది. చిత్తూరు, పూతలపట్టు, నగరి, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని కొందరు సర్వేయర్లు ఎకరా భూమిని కొలవాలంటే కనిష్ఠంగా రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నచోట రూ.50వేలు కూడా అడుగుతున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత అధికారులు, సిబ్బందికి చేసే అతిథి మర్యాదలు అదనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని