logo

కార్యాలయం దాటితే ఒట్టు..!

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్‌ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు.

Published : 03 Jul 2024 02:31 IST

పాఠశాలల్లో కొరవడిన పర్యవేక్షణ
పట్టించుకోని సెక్టోరియల్‌ అధికారులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్‌ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు.. విద్యా సంవత్సరం ప్రారంభమై 18 రోజులు దాటినా పాఠశాలల తనిఖీకి ఇప్పటివరకు అడుగు బయట పెట్టలేదు.. ఎప్పుడు చూసినా జిల్లా కార్యాలయమైన సమగ్ర శిక్షలోనే వీరు ఉంటున్నారు.. ఇదేమని ఆడిగితే కార్యాలయంలో ముఖ్యమైన దస్త్రాలు ఉన్నాయి వాటిని క్లియర్‌ చేయాలని చెబుతున్నారు.. ఓవైపు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలను పోటాపోటీగా చేపట్టగా వాటిని దీటుగా ఎదుర్కొని పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు ఆశించిన స్థాయిలో జరగలేదని రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశ్నించారని సమాచారం.

మొక్కుబడిగా ‘బడికి పోతాం’

విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బడికి పోతాం కార్యక్రమం ద్వారా బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మరో రెండు వారాల్లో ముగియనుంది. ఈలోగా నిర్దేశించిన విద్యార్థులందరూ పాఠశాలల్లో ప్రవేశం పొందాలి. ఐదేళ్లు నిండిన పిల్లలు ఎంతమంది ఉన్నారు..? వారిలో ఎంతమంది పాఠశాలలో చేరారు..? మిగిలిన వారు ఎంతమంది ఉంటారనే కచ్చితమైన సమాచారం విద్యాశాఖ, సమగ్ర శిక్ష వద్ద నేటికీ లేకపోవడం గమనార్హం. యూడైస్, చైల్డ్‌ఇన్ఫో యాప్‌లలోని డేటా ఆధారంగా లెక్కలు వేస్తున్నారు గానీ.. క్షేత్ర స్థాయిలో లెక్కలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకటో తరగతిలో ప్రవేశించేందుకు అర్హులైన పిల్లలందరూ ఇంకా పూర్తి స్థాయిలో పాఠశాలల్లో చేరలేదు  జిల్లాలో విద్యాశాఖ, సమగ్ర శిక్ష గణాంకాల ప్రకారం 21,899మంది విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశం పొందాల్సి ఉండగా ఇప్పటివరకు 14,729 మంది చేరారు. పాఠశాలలు ప్రారంభమై 18 రోజులు గడిచినా ఇంకా అధికారుల లెక్కల ప్రకారం ఇంకా రెండింట ఒక వంతు మాత్రమే ప్రవేశం పొందారు. ఇంకా పలు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలు శూన్యమని సంబంధిత యాప్‌లో కనిపిస్తున్నాయి. వీటిపై దృష్టి సారించాల్సిన అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది.

కార్యాలయాలకే పరిమితం

విద్యా సంవత్సరం పునః ప్రారంభం కాగానే విద్యాశాఖ, సమగ్ర శిక్ష శాఖల అధికారులు, సెక్టోరియల్‌ అధికారులు పిల్లల నమోదుపై దృష్టి సారించాలి. అయితే వీటిని పక్కనపెట్టి జిల్లా కార్యాలయంలోనే ఉంటున్నారు. కార్యాలయంలో రోజువారీ దస్త్రాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు చెబుతుండటంతో వారు అక్కడే పరిమితమయ్యారు. ప్రవేశాలు పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండటంతో ఆ ప్రభావం ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపనుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని