logo

దారి మార్చిన దుంగల దొంగలు

ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు.

Published : 03 Jul 2024 02:26 IST

సదాశివకోన అడవి నుంచి కేవీబీపురం మీదుగా అక్రమ రవాణా

పుత్తూరు పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో  స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు (పాతచిత్రం)

పుత్తూరు, న్యూస్‌టుడే: ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. నాలుగు మాసాల క్రితం ఏర్పేడు సమీపంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన టాస్క్‌ఫోర్సు కానిస్టేబుల్‌ను ఢీకొని వెళ్లిపోయారు. ఎన్నికలు వచ్చాక స్మగర్లు కాస్త నెమ్మదించారు. కోడ్‌ ముగియడం, చెక్‌పోస్టులు తీసివేయడంతో స్మగర్లు రూటు మార్చి.. ఏమార్చి అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. తిరుమలలో తనిఖీలు ఎక్కువ కావడంతో సదాశివకోన ప్రాంతంలో అయితే జనసంచారం ఉండదు కాబట్టి అటు వైపు స్మగర్లు రూటు మార్చారు.
శేషాచల అడవుల కేంద్రంగా సాగిన అక్రమ రవాణా కొన్నేళ్లుగా సదాశివకోన కేంద్రంగా సాగుతోంది. పుత్తూరు, వడమాలపేట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, కేవీబీపురం, నారాయణవనం ప్రాంతాల పరిధిలో 35 వేల హెక్టార్లలో ఈ అడవి విస్తరించి ఉంది. పుత్తూరు మండలం నుంచి నాగిలేరు మీదుగా, వడమాలపేట మండలంలో పాదిరేడు గొల్లపలి, రామసముద్రం, ఏర్పేడు మండలం చెల్లూరు, కేవీబీపురంలో ఓళ్లూరు, ఆదరం, నారాయణవనంలో సింగిర కోన తదితర ప్రాంతాల మీదుగా ఈ కోనలోకి దారులున్నాయి. ఇక్కడ జనసంచారం ఉండదు. దీంతో అక్రమ రవాణా నిరాటకంగా సాగిపోతోంది.

అడపాదడపా దాడులు

సదాశివ కోన కేంద్రంలో ఎర్రచందనం ఉండటంతో స్మగర్లు అటువైపు దృష్టి సారించారు.  జనసంచారం కూడా లేకపోవడంతో ఇక్కడే కూలీలు ఉండడానికి గుడిసెలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. గడిచిన రెండు మాసాల్లో చిత్తూరు టాస్క్‌ఫోర్సు సిబ్బందితో కలిసి పుత్తూరు అటవీశాఖ అధికారులు, సిబ్బంది మూడు దఫాలు కూంబింగ్‌ నిర్వహించడంతో ఎర్రచందనం కంటపడింది. కూలీలు మాత్రం పారిపోయారు.

పరిధి ఎక్కువ.. సిబ్బంది లేరు

పుత్తూరు అటవీశాఖ రేంజ్‌ పరిధి ఎక్కువైనా సరిపడా సిబ్బంది లేరు.  అనువైన వాహనాల్లేవు. ఉన్న సిబ్బంది చెక్‌పోస్టుల్లో ఉన్నారు. దీంతో అక్రమార్కుల పని సులభమవుతోంది. గతంలో టాస్క్‌ఫోర్సు సిబ్బందిని నియమించేవారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఎవరినీ నియమించలేదు. దీంతో విచ్చిలవిడిగా నరికి తరలించారు. స్థానికుల సహకారంతోనే ఇదంతా జరుగుతున్నా అధికారులు మాత్రం దృష్టిసారించడం లేదన్న విమర్శలున్నాయి. సదాశివకోనలో అక్రమ రవాణాకు స్థానిక సహకారం పుష్కలంగా ఉంది. లేదంటే తిరువణ్నామలై ప్రాంత వాసులకు తెలిసే పరిస్థితి లేదు.

నగరి, పిచ్చాటూరు ప్రాంతాలపై కన్ను

పిచ్చాటూరు, నాగలాపురం, నగరి పరిధిలో 22 వేల హెక్టార్లలో దట్టమైన అడవులున్నాయి. ఇక్కడ  3 వేల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించింది. దీనిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడి ఎర్రచందనం నరికి పలుమార్గాల్లో నిఘా కళ్లు గప్పి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా కేవీబీపురం నుంచి నిండ్ర మండలం శ్రీరామాపురం మీదుగా ఎర్రచందనంతో తమిళనాడు వెళ్తున్న కారు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. చేసేది లేక వాహనాన్ని వదిలేసి స్మగర్లు పారిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని