logo

జడ్పీకి పూర్వ కళ వచ్చేనా!

జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Published : 03 Jul 2024 02:23 IST

నేడు స్థాయి సంఘ సమావేశాలు
పాల్గొననున్న కొత్త ఎమ్మెల్యేలు

జడ్పీ కార్యాలయం

చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్తు ప్రజాప్రతినిధులు, ప్రజలు, గుత్తేదారులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఇప్పటి వరకు ఆ శోభ కన్పించలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండుచోట్ల(పుంగనూరు, తంబళ్లపల్లె) మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలుపొందారు. మూడు పార్లమెంటు స్థానాలు ఉండగా అందులో చిత్తూరు తెదేపా, తిరుపతి, రాజంపేట స్థానాలు వైకాపా హస్తగతం చేసుకున్న విషయం విదితమే. నలుగురు శాసనమండలి సభ్యులు ఉన్నారు. వీరందరూ జడ్పీ సర్వసభ్య సమావేశానికి శాశ్వత సభ్యులుగా హాజరై సమస్యలపై తమ గళం విప్పుతారు. జడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో వారికి ఏ స్థాయి సంఘంలో సభ్యులుగా ఉంటారో అందులో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఇతర సంఘాల్లో హాజరు కావాలనుకుంటే ఆ సంఘం ఛైర్మన్‌ అనుమతితో హాజరుకావచ్చు. బుధవారం జరిగే జడ్పీ స్థాయి సంఘ సమావేశం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో పలువురు హాజరై జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రస్తావించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం.

గతంలో.. అంతా వైకాపా కనుసన్నల్లో

వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే సర్వసభ్య, స్థాయి సంఘ సమావేశాలు జరిగాయన్న విమర్శలున్నాయి. సమావేశాలకు మీడియాకు అనుమతి లేదు. పౌరసంబంధాలు, సమాచార శాఖ అధికారులు సమావేశాన్ని కవరేజి చేసి అందజేసే పత్రికా ప్రకటన ఆధారంగా వార్తలు ప్రచురితమయ్యేవి. సభలో సభ్యులు సమస్యలు ప్రస్తావించినట్లు దాదాపు మూడేళ్లుగా సమాచార శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడి కాలేదన్నది నగ్నసత్యం. ఉమ్మడి జిల్లాలోని 65 మండలాల్లో జడ్పీటీసీ సభ్యులు వైకాపా అభ్యర్థులే. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో వారు సభలో సమస్యలపై ప్రస్తావించిన దాఖలాలు లేవని ప్రజలు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని