logo

రైతు సంక్షేమానికి అడుగులు

రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి.

Published : 03 Jul 2024 02:20 IST

సహకార సంఘాల కమిటీల రద్దు
ప్రత్యేక అధికారుల నియామకం

తడుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని చెర్లోపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిరుపయోగంగా మారడంతో ప్రస్తుతం ఆరేటమ్మ కాలనీ వద్ద అద్దె భవనంలో నడుస్తోంది. ఈ భవన నిర్మాణానికి స్థలం కేటాయించినా నిధుల్లేమి కారణంగా నిర్మాణం చేపట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించునున్నట్లు సమాచారం. డీసీసీబీ, సహకార శాఖ ఉద్యోగులను ఇన్‌ఛార్జిలుగా నియమించే అవకాశం ఉంది.

న్యూస్‌టుడే, పుత్తూరు, చిత్తూరు నగరం: రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. సహకార సంఘాల పదవీ కాలం 2019లో ముగిసినా ఆ ఏడాదే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక నాయకత్వం కనుసన్నల్లో పనిచేసే కమిటీలు ఏర్పాటు చేసి వారికి అధికారం కట్టబెట్టింది. ఎన్నికలు లేకుండా నామినేటెడ్‌ పద్ధతిలో నియమితులైన డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాల్లా మారారు. రైతులకు ఉపయోగపడే పనులు ఏవీ చేయలేదు. సహకార సంఘాల్లో నియమితులైన ముగ్గురు సభ్యుల కమిటీని కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడంతో అన్నదాతలకు అంతా మేలు జరిగే అవకాశం ఉంది.

  • జిల్లాలో ఇలా..: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 74 సహకార సంఘాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2013లో అధికారికంగా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా ఎన్నికైనవారు 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం ఈ సంఘాల పదవీ కాలాన్ని ఏడాది పెంచి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో సహకార సంఘాలను స్థానిక నాయకుల కనుసన్నల్లో పనిచేసే వారికి అప్పగించింది. గతంలో సహకార సంఘాలే రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేవి. సంఘంలోని రైతులూ తమ ఓటుహక్కుతో అధ్యక్షుడిని, 13 మంది సభ్యులను ఎన్నుకునేవారు. సహకార సంఘాలు రైతులకు పంట సాగుకు పెట్టుబడి సాయం మొదలు ఎరువులు, పురుగు మందులు రాయితీపై అందించడంలో కీలక పాత్ర పోషించేవి. రైతులు తాము పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచుకునేందుకు గోదాములు, తమ బ్యాంకుల ద్వారా రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందించేవి. నేడు ఈ సంఘాలతో అరకొర రుణాలు ఇప్పించడం మినహా ఏ రకమైన ఉపయోగం ఒనగూరలేదు.
  • గోదాముల నిర్మాణాలేవీ..?: జిల్లాలో గోదాములు నిర్మించాలని, ఒక్కో గోదాముకు రూ.50 లక్షలు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించారు. ఐసీడీపీ కింద నిధులు విడుదల అయితే 50 శాతం రీపేమెంట్, 20 శాతం రాయితీ, మరో 30 శాతం ప్రభుత్వం చెల్లించేలా విధివిధానాలు ఖరారు చేశారు. ఆ దస్త్రం గత ప్రభుత్వ హయాంలో మరుగున పడింది. బహుళ ప్రయోజనకర గోదాము అందుబాటులోకి వస్తే పంటలో తేమ శాతాన్ని కొలిచే పరికరం, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్‌ పట్టలు, పంట నాణ్యత కొలిచే పరికరాలు రైతుల సేవలకు సిద్ధంగా ఉంటాయి. అయితే నిర్మాణాలే చేపట్టకపోవడంతో ఇవన్నీ కోల్పోయినట్లే.
  • ఒక్క నగరి నియోజకవర్గంలో 9 సొసైటీలు..: ఒక్క నగరినియోజకవర్గంలోనే 9 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఒక్క నగరిలో మినహా మిగిలిన చోట్ల అంతటా సేవలు అంతంతమాత్రమే. చెర్లోపల్లి, కాయం సంఘాలకు సొంత భవనాలు కరవే. అయితే గత ప్రభుత్వం సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీంతో రైతులకు అందిన సేవలు అంతంతమాత్రమే.
  • కొందరు రాజీనామా చేశారు..: జిల్లాలో ఇప్పటికే సహకార సంఘాల్లోని కమిటీ సభ్యులు రాజీనామా చేశారు. ఇంకా కొందరు చేయాల్సి ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. వారి స్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలు అప్పగిస్తాం. అందుకు వేచి చూస్తున్నామని అధికారులు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని