logo

రూ.12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?

తిరుపతి మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే.

Published : 03 Jul 2024 02:08 IST

కుంగిన కుళశేఖర్‌ ఆళ్వార్‌ మార్గం

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అసలు రంగు బయటపడుతోంది. రాజకీయ, స్వప్రయోజనాలే లక్ష్యంగా హడావుడిగా చేపట్టిన వీటితో వందలాది మంది భూయజమానులు రోడ్డున పడిన విషయం విదితమే. తాజాగా వీటి నాణ్యతపై నగరంలో విస్తృత చర్చ జరుగుతోంది.

తిరుపతి నగరపాలకసంస్థ  ప్రతిష్టాత్మకంగా భావించి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన రూ.12 కోట్లు వెచ్చించి నిర్మించిన చింతలచేను రైల్వేగేటు- పద్మావతినగర్‌ వందడుగుల మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో మరమ్మతులు సర్వసాధారణమయ్యా యి. పలు ప్రాంతాల్లో తారు ఉబ్బడం, రోడ్డు భూమిలోకి కుంగడం వంటి లోపాలు బయటపడుతున్నాయి. నిత్యం రాకపోకలు నిలిపివేసి మరమ్మతుల పేరుతో నాలుగైదు అడుగుల గోతులు తవ్వి ప్యాచ్‌లు వేస్తున్నారు.

ఇప్పుడేమంటారో?.. సాధారణ స్థాయిలోనూ వర్షాలు పడని ప్రస్తుత తరుణంలో రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే ఓ మోస్తరు వర్షం కురిస్తే రోడ్డు ఆనవాళ్లు ఎంతవరకు నిలుస్తాయనే సందేహాలు అధికారుల్లో సైతం కనిపిస్తున్నాయి. అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారనే నగరపెద్దలు, పౌరసమాజం మేధావులు, అవినీతిని భుజాన మోసిన ప్రముఖులు పరిశీలించి తిరుపతివాసుల సొమ్ముకు న్యాయం చేయాలన్న వినతులు వెల్లువెత్తుతున్నాయి.

అభినయ్‌ హడావుడితో..

రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా 1.29 కి.మీ. దూరంలో ఉన్న పద్మావతినగర్‌ వరకు నిర్మించిన మార్గానికి ఇరువైపులా ఎక్కడా జనావాసాలు లేవు. మార్గమధ్యలో ఉన్న నగరపాలిక పాఠశాలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే కూల్చి విద్యార్థులకు అన్యాయం చేశారు. ఉపమేయర్‌ అభినయ్‌రెడ్డి కనుసన్నల్లో 2023 మార్చి నెలాఖరుకు 12 మాస్టర్‌ప్లార్‌ రోడ్లు నిర్మించాలని కౌన్సిల్‌లో తీర్మానించడం, నిధులు సమకూర్చలేక ఆలస్యం చేసి రోజులు, గంటల్లో పనులు పూర్తిచేయాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. 2024 మార్చి 13న ప్రారంభించిన కుళశేఖర్‌ ఆళ్వార్‌ మార్గం నిండా మరమ్మతులే కనిపిస్తున్నాయి.

ప్యాచ్‌ పక్కనే వెళ్తున్న ద్విచక్ర వాహనదారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని